ఈసీపై విరుచుకుపడ్డ టీడీపీ ఎంపీ 

ఈసీపై విరుచుకుపడ్డ టీడీపీ ఎంపీ 

కేంద్ర ఎన్నికల సంఘంపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విరుచుకుపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు స్థానాల్లో రీపోలింగ్ పై టీడీపీ నాయకులు గురువారం ఎన్నికల సంఘాన్ని కలిశారు. సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ రావు ఎన్నికల సంఘం అధికారులకు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వచ్చాక ఎన్నికల సంఘం పై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ ఫిర్యాదుపై విచారణ లేకుండానే రీపోలింగ్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై కోర్టుకు వెళ్తామన్నారు. పార్లమెంట్ లో చర్చ జరిపి, ఎంక్వైరీ చేస్తామని హెచ్చరించారు.  ఎన్నికల కమిషన్ కార్యాలయం..”బీజెపి ఎలక్షన్ కమిషన్” గా మారిందని ఎద్దేవా చేశారు. 

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్త కండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాల్లో పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో మే19న ఐదు స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.