ఆ విషయం తెలిసే వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామా!

ఆ విషయం తెలిసే వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామా!

ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చే అకాశం లేదు కాబట్టే సమయం చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని...  2014లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 2014 మే 18 నుంచి 2019 మే 17 వరకు 16వ లోక్‌సభ టర్మ్ ఉంటుందని తెలిపిన కేశినేని... ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 101 ఏ ప్రకారం టర్మ్ మరో ఏడాది లోపు ఉండగా రాజీనామా చేస్తే ఎన్నికలు నిర్వహించకూడదనేది ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి. ఆ విషయం తెలిసే ఎంపీలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజీనామా డ్రామాలు ఆడిస్తున్నారని మండిపడ్డారు. 

ప్రత్యేక హోదా కోసం 2016లోనే రాజీనామాలు చేస్తామని ప్రకటించిన వైఎస్ జగన్... అప్పుడు రాజీనామా చేయకుండా ఇప్పుడు ఎందుకు చేశారని ప్రశ్నించారు కేశినేని నాని. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీతో కుమ్మక్కు అయ్యారు కాబట్టే ఇప్పుడు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నామంటూ జగన్ చేస్తున్న మోసాన్ని ఐదు కోట్ల మంది ఆంధ్రులు గమనిస్తున్నారన్నారు కేశనిని నాని... బీజేపీతో కుమ్మక్కై అయ్యి రాజీనామాలు చేశారు కాబట్టే... ఇంకా రాజీనామాలు ఆమోదం పొందడంలేదని విమర్శించారు. కాంగ్రెస్‌తో లాలూచీ పడి జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చి అప్పుడు మోసం చేసిన జగన్... ఇప్పుడు 12 కేసుల మాఫీ కోసం బీజేపీ, నరేంద్ర మోదీతో కుమ్మక్కై మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు కష్టపడుతుంటే సహకరించకపోగా... అభివృద్ధికి అడ్డుపడే కార్యక్రమాలు చేస్తున్నారన్నారు కేశినేని. రాజీనామాలు సమర్పించినా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ అన్ని ప్రయోజనాలు ఎందుకు పొందుతున్నారని వైసీపీ ఎంపీలను ప్రశ్నించారు కేశినేని... చిత్తశుద్ధి ఉంటే యడ్యూరప్ప, శ్రీరాములు లాగా ఎందుకు రాజీనామాలను ఆమోదింపజేసుకోలేదని ఆయన ప్రశ్నించారు.