సోషల్ మీడియాలో కేశినేని నాని మరో పోస్ట్..!

సోషల్ మీడియాలో కేశినేని నాని మరో పోస్ట్..!

సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయవాడ ఎంపీగా విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యులు కేశినేని నానికి ఆ పార్టీ నేతలతో పొసగడంలేదు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. కాస్త కేశినేని నాని తగ్గినట్టుగానే కనిపించిన ఇవాళ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు... ఈ సారి నేరుగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావును టార్గెట్ చేశారు కేశిశేని నాని.. "కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి!!!'' అంటూ హాట్ పోస్ట్ పెట్టారు. ఓవైపు దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూనే... మరోవైపు కొడాలి నానిపై సెటైర్లు వేశారు. ఇప్పుడు ఈ ఫేస్ బుక్ పోస్ట్.. ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నుంచి గెలిచిన కొడాలి నాని.. టీడీపీ నేత దేవినేనికి కృతజ్ఞుడిగా ఉండడం ఏంటి? అని చెవులు కొరుకుంటున్నారు. కాగా, ఆ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు.. కేశినేని నానిని లోక్‌సభలో పార్టీ విప్‌గా నియమిస్తే.. ఆయన తిరస్కరించిన సంగతి తెలిసిందే.. అదే సందర్భంలో 'పోరాడితే పోయేదేమి లేదు.. బానిస సంకెళ్ళు తప్ప' అనే పోస్ట్ పెట్టి తీవ్రమైన చర్చకు దారితీశారు కేశినేని నాని.