టీఆర్ఎస్ హోదా డిమాండ్ వెనుక బీజేపీ కుట్ర...

టీఆర్ఎస్ హోదా డిమాండ్ వెనుక బీజేపీ కుట్ర...

టీఆర్ఎస్ ప్రత్యేక హోదా డిమాండ్ బీజేపీ కుట్రలో భాగమే అన్నారు టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ... బీజేపీ ప్రోద్భలంతోనే టీఆర్ఎస్ నేతలు తెలంగాణకు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డ నారాయణ... బీజేపీ కుట్రలో టీఆర్ఎస్ భాగస్వామి కాకూడదని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మిగిలిన రాష్ట్రాలనూ ఎగదోస్తోందని విమర్శించిన కొనకళ్ల... చంద్రబాబుకు... కేసీఆరుకు పోలిక పెడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ... తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పొగిడినప్పుడే విషయం అర్ధమైపోయిందన్నారు. కేసీఆర్ కంటే చంద్రబాబు సీనియర్... చంద్రబాబు ఎప్పుడో సీఎం అయ్యారని గుర్తు చేశారు కొనకళ్ల.

చంద్రబాబే అభివృద్ధి చేస్తారనే విషయాన్ని ప్రపంచం ఎప్పుడో గుర్తించందన్నారు కొనకళ్ల నారాయణ... రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సభలో ప్రస్తావిస్తే.. ప్రధాని నరేంద్ర మోడీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డ ఆయన... ప్రధాని నుంచి బాధ్యతాయుతమైన సమాధానం ఆశించాం... కానీ, మోడీ నటనకే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రధాని మోడీ తీరుతో పార్లమెంటరీ వ్యవస్ధపై నమ్మకం కొల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. వైఎస్‌ జగన్‌ను అనుసరించాల్సిన ఖర్మ తెలుగుదేశం పార్టీకి లేదని... ప్రధాని అభ్యర్ధిగా చంద్రబాబు నాయుడు వస్తారనే నరేంద్ర మోడీకి భయం పట్టుకుందన్నారు కొనకళ్ల నారాయణ.