తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది: హరీష్

తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది: హరీష్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి వలసలు ఊపందుకున్నాయి. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ పార్టీ మండల నాయకులు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైందని విమర్శించారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లాలు ప్రసాద్ యాదవ్ పార్టీకి పట్టిన గతే టీడీపీకి పట్టిందన్నారు. జార్ఖండ్ ప్రజలు బీహార్ పార్టీగా ముద్రవేశారని గుర్తు చేశారు. టీడీపీ కూడా ఆంధ్ర పార్టీ అనే ముద్ర పడిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే టీడీపీ అడ్రస్ గల్లంతయ్యిందని మండిపడ్డారు. నేడు కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలో ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్ట్ అనుమతులు వస్తే నాగార్జున సాగర్ పై 45 టీఎంసీల హక్కు కల్పించబడుతుందని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. దానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు. కాబట్టే నువ్వు ఆంధ్ర బాబు అంటున్నాం. తొండి చేసే టీడీపీతో కాంగ్రెస్ ఎలా జతకడుతుంది. నోటితో మాట్లాడి నొసలుతో ఎక్కిరించినట్టుంది చంద్రబాబు పరిస్థితి. ఎవరు ఏమైనా సరే 4 సీట్లు సంపాదించాలని చంద్రబాబు చూస్తుండు. టీడీపీ పార్టీ నుండి చేరుతున్న ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేస్తున్న. అందరం కలిసి సిద్దిపేట చరిత్ర తిరగరాసి కేసీఆర్ కు బహుమతి గా ఇవ్వాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.