టీడీపీ శ్రేణులపై దాడులను అదుపుచేయాలి

టీడీపీ శ్రేణులపై దాడులను అదుపుచేయాలి

ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులను ఆపార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ లో పార్టీ రాష్ట్ర స్ధాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం కార్యకర్తల్లో ఏ ఒక్కరూ ఒంటరి కాదని నేతలకు ధైర్యం చెప్పారు. 37 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఐదుసార్లు గెలిచామని, నాలుగు సార్లు ఓడిపోయామని గుర్తు చేశారు. గెలిచినప్పుడు ఆనందం, ఓడినప్పుడు ఆవేదన సహజమని, అయినా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. తమకు ఓట్లేసిన ప్రజలు, నమ్మిన కార్యకర్తలకు అండగా ఉండాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు, ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. దాడులను నివారించడం, దౌర్జన్యాలను ఎదుర్కోవడమే తక్షణ కర్తవ్యమన్నారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లా అండ్ ఆర్డర్ అదుపుతప్పుతోందని ఆరోపించారు. ఫలితాల తరువాత 100 చోట్ల దాడి ఘటనలు జరిగాయని తెలిపారు. సీఎం జగన్ వెంటనే వీటిని అదుపుచేయాలని చంద్రబాబు అన్నారు. వైసీపీ దాడుల్లో ఐదుగురు కార్యకర్తలు చనిపోయారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున చంద్రబాబు నాయుడు ఆర్ధిక సాయం ప్రకటించారు. వైసీపీ కిరాతక దాడులను ఖండిస్తూ టీడీపీ రాష్ట్ర పార్టీ సమావేశంలో తీర్మానం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు సోమవారం రాష్ట్ర డీజీపీని కలవనున్నారు.