టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి కిడ్నాప్..

టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి కిడ్నాప్..

ఏపీలో పంచాయితీ ఎన్నికల తొలి విడత నామినేషన్ లు దాఖలు అవుతున్నాయి. నిన్న మొదటి రోజు కావడంతో కాస్త సంఖ్య తక్కువ గానే ఉన్నా ఈరోజు పెద్ద ఎత్తున ఈ నామినేషన్ లు నమోదవుతున్నాయి. అయితే ప్రకాశం జిల్లా పెద్దగంజాంలో సర్పంచ్ అభ్యర్థి తిరుపతిరావుని ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారు. పెద్దగంజాం పంచాయితీ సర్పంచ్ పదవికి నామినేషన్ వేసేందుకు తిరుపతిరావు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఎత్తుకెళ్లారు. పెద్దగంజాం పంచాయితీ ఎన్నికల్లో తిరుపతిరావుకి టీడీపీ మద్దతు తెలిపింది. పెద్ద గంజాం ఏకగ్రీవం చెయ్యాలని వైసీపీ నాయకులు గత కొద్ది రోజులుగా గ్రామంలో చర్చలు జరుపుతున్నారు. అయితే తిరుపతిరావుకి టీడీపీ మద్దతు తెలపడంతో నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న తిరుపతిరావుని కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తిరుపతిరావు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టారు. ఇక ఈ ఏకగ్రీవాల అంశం మీదనే ఇప్పుడు ఎన్నికల సంఘం - ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ప్రభుత్వం ఏకాగ్రీవాలకు పట్టు పడుతోంటే ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరగాల్సిందేనని, బలవంతపు ఎన్నికల ఏకాగ్రీవాలను అస్సలు ఒప్పుకోమని చెబుతోంది.