బెజవాడ-గుంటూరు కార్పొరేషన్లలో టీడీపీ పరిస్థితి ఏంటి?

బెజవాడ-గుంటూరు కార్పొరేషన్లలో టీడీపీ పరిస్థితి ఏంటి?

అక్కడేమో లీడర్ లేడు.. ఇక్కడేమో ఉన్న వారిలో ఐక్యత లేదు. మరి గెలుపెలా? విజయవాడ-గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్లలో టీడీపీ పరిస్థితి ఇది. మూడు రాజధానులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో నాయకత్వం లోపం వేధిస్తోందట. మరి.. ప్రచారానికి సిద్ధమని చెప్పిన చంద్రబాబుకు ఎదురయ్యే సవాళ్లేంటి? 
 
వైసీపీ, టీడీపీలకు కీలకం!

పంచాయతీ ఎన్నికలు ముగియడంతో పురపోరుపై దృష్టిపెట్టాయి ఏపీలోని పార్టీలు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు.. మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలు ఒక ఎత్తు అయితే.. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ల ఎన్నికలు మరోఎత్తు. మూడు రాజధానుల అంశంతో ముడిపడి ఉండటంతో ఇక్కడి ప్రజా తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అమరావతికి కట్టుబడి ఉన్న టీడీపీకి ఈ రెండు చాలా కీలకం. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్న అధికారపక్షం వైసీపీ తేలికగా తీసుకునే అవకాశం లేదు. ఈ రెండు చోట్లా వైసీపీ పాగా వేయలేకపోతే.. రాజధాని తరలింపే కారణమనే ప్రచారం మొదలవుతుంది. అదే సమయంలో టీడీపీ గెలుచుకోలేకపోతే అమరావతి ప్రభావం లేదనే వాదన వినిపించే అవకాశం ఉంటుంది.  అందుకే ఈ రెండు పార్టీలకు ఇవి కీలకంగా మారాయి.
 
కత్తులు దూసుకుంటున్న బెజవాడ టీడీపీ నేతలు!

నాయకత్వ లోపంతో మున్సిపల్‌ కార్పొరేషన్లలో టీడీపీ ఎదురీదుతోందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. విజయవాడలో నాయకుల కొరత లేకున్నా అక్కడ వర్గపోరు పతాకస్థాయికి చేరుకుంది. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే మూడు నియోజవకర్గలకుగాను సెంట్రల్, తూర్పులలో గట్టి నాయకత్వం ఉంది. పశ్చిమ నియోజకవర్గ వ్యవహారాన్ని బుద్దా వెంకన్న, నాగుల్ మీరా చూస్తున్నారు. బెజవాడలో టీడీపీ నాయకులంతా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. దీంతో పక్కా వ్యూహాలతో.. అన్ని హంగులతో ఎన్నికలకు వెళుతున్న వైసీపీని కొట్టడం టీడీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజీ కాదన్నది కొందరి వాదన. కేవలం స్వయంకృతాపరాధంతోనే పార్టీ నష్టపోయే పరిస్థితి ఉందట. అధినేత ఇప్పటికే దృష్టిపెట్టినా.. ఎంతవరకు వీరు కలిసి పని చేస్తారో చెప్పలేకపోతున్నారు. 
 
గుంటూరులో టీడీపీని ఎవర్‌ లీడ్‌ చేస్తారు? 

గుంటూరులో టీడీపీకి దిక్కెవరు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే  మద్దాలి గిరి .. సీఎం జగన్‌కు జైకొట్టారు. గుంటూరు తూర్పులో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో మేయర్ ఎన్నికల్లో టీడీపీని ఎవరు లీడ్ చెయ్యాలో తెలియడం లేదట. ఎమ్మెల్యే మద్దాలికి ఈ ఎన్నిక పెద్దపరీక్షగా నిలవబోతోంది. వైసీపీ అభ్యర్థులను గెలిపించలేకపోతే అధికారపార్టీలో ఆయన ఇబ్బంది పడతారు. అందుకే ముందునుంచీ కసరత్తు మొదలుపెట్టారు గిరి. ఇక టీడీపీ కోవెలమూడి నాని అనే నేతను మేయర్ అభ్యర్థిగా చెబుతోంది. ఆయన పార్టీని లీడ్‌ చేయగలరా? ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ.. ఎంతవరకు ముందుకు వస్తారు అనేది ఇప్పటికీ తేలలేదట. గుంటూరు తూర్పు ఇంచార్జ్‌గా ఉన్న నజీర్ అహ్మద్ సైతం పార్టీని ఏ మేరకు సాయం పడతారన్నది అనుమానమేనట. 
 
టీడీపీకి బలగమున్నా సమర్థ నేతలు లేరా? 

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే టీడీపీకి విజయవాడ-గుంటూరులలో గట్టి పట్టు ఉంది. కాకపోతే మేయర్ ఎన్నికల్లో పార్టీని సమర్థమంతంగా లీడ్ చేసే వారే దొరకడం లేదట. చంద్రబాబు మాత్రం ప్రచారానికి సై అంటున్నారు. ముందుగా పార్టీని గాడిలో పెట్టకుండా ఆయన ప్రచారానికి వస్తే సవాళ్లు ఎదుర్కోక తప్పదన్నది తమ్ముళ్ల మాట.