జగన్‌ ప్రమాణ స్వీకారానికి టీడీపీ బృందం..!

జగన్‌ ప్రమాణ స్వీకారానికి టీడీపీ బృందం..!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా విజయవాడలో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైసీపీ అధినేత జగన్‌.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా? అనే అంశంపై ఇవాళ టీడీఎల్పీ సమావేశంలో చర్చించారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయగా.. నేతలు వారించినట్టు తెలిసింది. 

రాజ్ భవన్ వంటి వేదికల వద్ద ప్రమాణ స్వీకారం చేస్తే వెళ్లొచ్చని.. బహిరంగంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందున్న వెళ్లడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. పార్టీ తరఫున ఒక బృందాన్ని పంపాలని పేర్కొనగా చంద్రబాబు అంగీకరించారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, పయ్యావుల కేశవ్‌లను పంపించాలని బాబు నిర్ణయించారు. జగన్‌కు శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు తరఫున టీడీపీ బృందం అభినందన లేఖ అందజేయనున్నారు.

 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో జగన్‌ను ఫోన్ చేసి ఆహ్వానించారు. కానీ.. జగన్‌ ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆ పార్టీ నేతలెవరూ కూడా హాజరుకాలేదు.  ఇక.. తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను జగన్ ఆహ్వానించారు. తాము విచ్చేస్తామని కేసీఆర్, స్టాలిన్‌లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.