120 అసెంబ్లీ, 20 ఎంపీ సీట్లు మావే.. ఆయనే సీఎం..!

120 అసెంబ్లీ, 20 ఎంపీ సీట్లు మావే.. ఆయనే సీఎం..!

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీల 120 అసెంబ్లీ స్థానాల్లో, 20 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుందని... తిరిగి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టబోతున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ ఒడిపోతున్నామనే ఒత్తిడిలో ఉన్నారన్నారు. మే 23న చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఒడిపోతున్నానే భయంతోనే ప్రధాని నరేంద్ర మోడీ.. బీసీ అంశాన్ని లేవనెత్తారన్నారని.. ప్రధానిగా ఉండి కులం ప్రస్తావన తీసుకురావడం నీచమైన విషయమని మండిపడ్డారు రాజేంద్రప్రసాద్. 

జగన్ కేసుల్లో ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంని ఏ రకంగా సీఎస్ గా నియమిస్తారని ప్రశ్నించిన రాజేంద్రప్రసాద్... ఎన్నికల కమిషన్ అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తే ఎలా తప్పు అవుతుందని ప్రశ్నించారు. సీఎం ఆపద్ధర్మ సీఎం కాదు.. పూర్తి స్థాయి సీఎం... ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీకాలం ఐదేళ్లు ఉంటుందన్నా రాజేంద్రప్రసాద్... జూన్ 7 2014లో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు... మళ్లీ జూన్ 6 2019వ తేదీ వరకు సీఎంగా ఉంటారని గుర్తుచేశారు. పోలింగ్ అయ్యాక కూడా ప్రజల సంక్షేమం చూడకూడదని చెప్పడానికి ఈసీ ఎవరు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్సీ... కౌంటింగ్ అయ్యేవరకు సీఎం సమీక్షలు జరపకపోతే ప్రజల సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నించారు.