168 సార్లు చెంపదెబ్బలు, ఉపాధ్యాయుడు అరెస్ట్

168 సార్లు చెంపదెబ్బలు, ఉపాధ్యాయుడు అరెస్ట్

ఆరో తరగతి చదువుతున్న ఓ బాలిక హోంవర్క్‌ చేయలేదని అత్యంత కర్కశంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్ధానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతడిని జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ఝాబువా జిల్లా థండ్లా తహసీల్‌కు చెందిన ఓ బాలిక స్థానిక జవహార్‌ నవోదయ స్కూల్‌లో చదువుతోంది. అనారోగ్యం కారణంగా గతేడాది జనవరి 1 నుంచి 10 వరకు ఆ బాలిక పాఠశాలకు వెళ్లలేదు. జనవరి 11న బాలిక తిరిగి స్కూల్‌కు వెళ్లింది. అయితే హోంవర్క్‌ పూర్తిచేయలేదని ఆగ్రహించిన ఉపాధ్యాయుడు మనోజ్‌ వర్మ తోటి విద్యార్థినులతో బాలికను 168 సార్లు చెంప దెబ్బలు కొట్టించాడు. ఇంటికొచ్చిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేశాడు. దీంతో కమిటీ వేసి మనోజ్‌ వర్మను దోషిగా తేల్చి.. ఇటీవల అతడిని సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తనకు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించగా.. కోర్టు అతడి అభ్యర్థనను తిరస్కరించింది. ఇదిలా ఉండగా.. ఫిర్యాదు చేసిన దాదాపు ఏడాదిన్నర తర్వాత సదరు ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.