పోలీసుల అవగాహనా రాహిత్యం...క్రికెటర్లకు వింత అనుభవం

పోలీసుల అవగాహనా రాహిత్యం...క్రికెటర్లకు వింత అనుభవం

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టుకు వైజాగ్ నగరం ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్ లో టీమిండియా 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కాగా, ఆదివారం మ్యాచ్ ముగియగా, సోమవారం రెండు జట్లు పుణే నగరానికి బయల్దేరాయి. ఎయిర్ పోర్టుకు చేరుకునేంతలో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో వైజాగ్ ఎయిర్ పోర్టులో  విశాఖలో టీమిండియా క్రికెటర్లకు వింత అనుభవం ఎదురైంది.

పోలీసుల అవగాహన రాహిత్యంతో క్రికెటర్లు వర్షంలో తడచుకుంటూ ఎయిర్‌ పోర్టులోకి వెళ్లాల్సి వచ్చింది. విశాఖ ఎయిర్‌ పోర్టుకి క్రికెటర్లను తీసుకుని వెళ్లే విషయంలో పోలీసులు కన్ఫ్యూజ్ కావడంతో ప్లాట్ ఫాం నెంబర్‌ 3 పై నిలిపారు. ప్లాట్ ఫామ్ నెం.1 వద్దకు టీమిండియా క్రికెటర్ల బస్సును అనుమతించాల్సి ఉండగా, విమానాశ్రయ భద్రతా సిబ్బంది దక్షిణాఫ్రికా క్రికెటర్లున్న బస్సును అనుమతించారు. భారత క్రికెటర్లున్న బస్సును ప్లాట్ ఫామ్ నెం.3 వద్దకు పంపారు.

అప్పటికే వర్షం కురుస్తుండటంతో  అక్కడ పైకప్పు లేకపోవడంతో భారత క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు వర్షంలో తడిసిపోయారు. ఈ విషయమై రోహిత్ శర్మ ఎయిర్ పోర్టు సీఐని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆటగాళ్లు తమ లగేజీతో వర్షంలో అసౌకర్యానికి గురైనట్టు సమాచారం.  ప్లేయర్లు తడుచుకుంటూ ఎయిర్‌ పోర్టులోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.