వరల్డ్ కప్ సూట్ కోసం క్రికెటర్ల తంటాలు

వరల్డ్ కప్ సూట్ కోసం క్రికెటర్ల తంటాలు

మీరు సూట్ కుట్టించుకోవాలంటే దర్జీ దగ్గరకి మీరు వెళ్లాలి తప్ప అతను మీ ఇంటికి రావడం జరుగుతుందా? జరగదు కదా! కానీ మీరు భారత క్రికెట్ జట్టు సభ్యుడైతే మాత్రం ఇది అక్షరాలా జరుగుతుంది. అందులోనూ మీరు ప్రపంచ కప్ కి ఎంపిక చేసిన జట్టులో ఉంటే ఇక మీరు వెళ్లిన చోటికల్లా వచ్చి మరీ టైలర్లు కొలతలు తీసుకుంటారు. ప్రస్తుతం వరల్డ్ కప్ కి ఎంపికైన టీమిండియా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఈ విలాసాన్నే కులాసాగా అనుభవిస్తున్నారు. గత కొద్ది రోజులుగా టైలర్లు టేపులతో వెంటపడి మరీ వాళ్ల సైజులు తీసుకుంటున్నారు.

ప్రపంచ కప్ కోసం భారత క్రికెట్ బోర్డ్ ప్రతి ఆటగాడికి ప్రత్యేకమైన సూట్లు తయారు చేయిస్తోంది. ఈ స్పెషల్ ఆర్డర్ పొందిన కంపెనీ.. ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ కొలతల కోసం తమ మనుషులను పంపిస్తోంది. ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతుండటంతో వివిధ ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ జట్లకు బస ఏర్పాటు చేసిన హోటళ్లకు టైలర్లు వెళ్లి మరీ సైజులు తీసుకుంటున్నారు. ఇక సహాయ సిబ్బంది ఇళ్లకు టేపులతో వెళ్లి పని కానిస్తున్నారు.

'వాళ్లు ఒక్కొక్కరి కోసం ప్రత్యేకంగా సూట్లు తయారు చేస్తారు. మేం వాళ్లకి ఆర్డర్ ఇచ్చాం. ఆటగాళ్ల శరీర సౌష్టవం ప్రకారం వాళ్లు కొలతలు తీసుకొని సూట్లు కుడతారని' బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 'ఐపీఎల్ సీజన్ కావడంతో ఆటగాళ్లంతా చెల్లాచెదురుగా ఉన్నారు. దీంతో కంపెనీ వాళ్ల దగ్గరకే వెళ్లి కొలతలు తీసుకొంటోంది. ఆటగాళ్లకు ముందస్తుగా చెప్పి వాళ్ల సైజులు తీసుకోవాలని వాళ్లని కోరామని' చెప్పారు.

ఈ సూట్లలో ఒక నీలం రంగు బ్లేజర్, నీలం ప్యాంటు, తెల్ల షర్టు, బుండీ షర్ట్ ఉంటాయి. ఇవన్నీ కూడా నాణ్యమైన వస్త్రంతో తయారు చేస్తారు. బ్లేజర్ జేబుపై బీసీసీఐ చిహ్నం ముద్రించి ఉంటుంది. ఇంగ్లాండ్ లో అధికారిక కార్యక్రమాల సమయంలో ఆటగాళ్లు ఈ సూట్లను ధరిస్తారు. జట్టు బాగా కనిపించేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది. ముందు ఒక ఇటాలియన్ బ్రాండ్ తో సూట్లు తయారు చేయిద్దామనుకొన్న చివరి నిమిషంలో మనసు మార్చుకొని ఒక భారతీయ బ్రాండ్ కి ఈ బాధ్యతలు అప్పజెప్పింది. ఆ బ్రాండ్ ఏదో అటు బీసీసీఐ చెప్పడం లేదు. కంపెనీ కూడా నోరు విప్పడం లేదు. కానీ ఆ బ్రాండ్ ఉపశీర్షిక 'ది కంప్లీట్ మ్యాన్' అని మాత్రం తెలిసింది. ఇప్పుడు ఈ సూట్లు వేసుకొని భారతీయ ఆటగాళ్లు కంప్లీట్ క్రికెటర్లు అవుతారన్న మాట.