రిటైర్మెంట్ ప్రకటించిన ఆండీ ముర్రే

రిటైర్మెంట్ ప్రకటించిన ఆండీ ముర్రే

గాయాలతో బాధ పడుతున్న బ్రిటన్ టెన్నిస్ ఆటగాడు కన్నీళ్లతో అంతర్జాతీయ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరమైన మాజీ చాంపియన్‌ ఆండీ ముర్రే శుక్రవారం ఈ ఏడాది రిటైర్ కానున్నట్టు చెప్పాడు. వింబుల్డన్ వరకు ఆడాలనుందని.. కానీ ఆస్ట్రేలియన్ ఓపెన్ తన చివరి ఈవెంట్ కావచ్చని తెలిపాడు. మాజీ ప్రపంచ నెంబర్ వన్, మూడుసార్లు గ్రాండ్ స్లామ్ విజేత అయిన ముర్రే తుంటి సర్జరీ కారణంగా గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. 

జూన్ లో లండన్ లో జరిగిన క్వీన్స్ క్లబ్ టోర్నీలో మాత్రమే ఆడాడు. ఆ తర్వాత కేవలం నాలుగు టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొన్నాడు. చివరిగా సెప్టెంబర్ లో జరిగిన షెంజెన్ టోర్నీలో ఆడిన ముర్నే ఆ తర్వాత ఫిట్ నెస్ పై దృష్టి పెట్టేందుకు మరే పోటీలో ఆడలేదు. గత వారం బ్రిస్బేన్ లో జరిగిన టోర్నీ రెండో రౌండ్ లో నాకౌట్ అయ్యాడు. గురువారం నొవాక్ జొకోవిచ్ తో గంట కంటే తక్కువ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన బ్రిటిష్ ఆటగాడు ఇక తన వల్ల కాదంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. 

కొంతకాలంగా ఆండీ తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నాడు. ఈ బాధతో తాను ఆటను ఆస్వాదించలేనందు వల్ల ఆట నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. ఇలా అర్ధాంతరంగా ఆట నుంచి తప్పుకోవడం బాధగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వింబుల్డన్ ఆడి ఆపేయాలని ఉన్నా అంత వరకు ఆడలేకపోవచ్చు. ఆస్ట్రేలియన్ ఓపెనే తన చివరి టోర్నీ కావచ్చన్నాడు. ముర్రే ఆట నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో టెన్నిస్ క్రీడాకారులు, దిగ్గజ ఆటగాళ్లు, ముర్రే అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.