వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ ఈ గుజరాత్ అమ్మాయిదే... 12 ఏళ్లలో తొలిసారిగా కటింగ్...!

వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ ఈ గుజరాత్ అమ్మాయిదే... 12 ఏళ్లలో తొలిసారిగా కటింగ్...!

గుజరాత్‌లోని మోడాసాకు చెందిన నీలాంషి పటేల్ వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ కలిగిన అమ్మాయిగా గిన్నిస్ రికార్డు ను సొంతం చేసుకుంది. 2018లో యుక్తవయసులో పొడవైన జుట్టు కలిగిన అమ్మాయిగా నీలాంషి వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ ను గెలుచుకుంది. ఆ సమయంలో ఆమె వయసు 16 సంవత్సరాలు. ఆమె జుట్టు 170.5 సెంటీమీటర్లు ఉంది. నీలాంషి తన 18వ పుట్టినరోజుకు ముందే జూలై 2020లో చివరిసారిగా జుట్టును కొలిచింది. ఇది 200 సెంటీమీటర్ల పొడవుకు చేరుకుంది. ఇంకేముంది తన రికార్డును తానే మరోసారి బ్రేక్ చేసింది. అయితే తాజాగా ఈ గుజరాత్ రెపాంజల్ 12 సంవత్సరాల తరువాత మొదటిసారిగా తన జుట్టును కట్ చేసింది. నీలాంషి హెయిర్ కట్ ను డాక్యుమెంట్ చేసిన ఒక నిమిషం నిడివి గల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. హెయిర్ కట్ కు ముందు “నా జుట్టు నాకు చాలా ఇచ్చింది. కానీ దానిని తగ్గించే సమయం వచ్చింది. నేను మిమ్మల్ని చాలా కోల్పోతాను, మిత్రమా” అంటూ నీలాంషి ఎమోషనల్ అయ్యింది. నీలాంషికి కట్ చేసిన జుట్టును ఏం చేయాలనే దానికి మూడు ఆప్షన్లు ఉన్నాయి. వేలం వేయడం, క్యాన్సర్ రోగుల కోసం స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇవ్వడం లేదా మ్యూజియంకు విరాళం ఇవ్వడం. అయితే నీలాంషి ఆమె తల్లి సలహా ప్రకారం రికార్డ్స్ క్రియేట్ చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఈ జుట్టును మ్యూజియానికి విరాళంగా, క్యాన్సర్ రోగులకు దానం కూడా చేస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నీలాంషి హెయిర్ కట్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.