మాదే అతిపెద్ద పార్టీ... ఆహ్వానించండి...

మాదే అతిపెద్ద పార్టీ... ఆహ్వానించండి...

కర్నాటకలో గవర్నర్ వాజుభాయ్ వాలా... బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో ఇతర రాష్ట్రాల్లోనూ పెద్ద పార్టీలు మేల్కొంటున్నాయి.  కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి జట్టుకట్టడంతో బీజేపీ కంటే వారికి ఎక్కువ స్థానాలున్నాయి. అయితే ఆ కూటమిని కాదని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ ఆహ్వానించారు. అయితే కన్నడ పొలిటికల్ సెగ బీహార్‌ను తాకింది. బీహార్‌లో మొదట ఆర్జేడీ, జనతా దల్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఆర్జేడీకి బైబై చెప్పి... బీజేపీతో జతకట్టి... మళ్లీ సీఎం అయ్యారు నితీష్‌కుమార్. అయితే ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో  మాత్రం అతిపెద్ద పార్టీగా అవతరించింది ఆర్జేడీయే... ఇప్పుడు ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. 

ఈ రోజు తమ మిత్ర పక్షాలైన కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) నేతలతో కలిసి గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కలిసిన తేజస్వి యాదవ్... బీహార్‌ అసెంబ్లీలో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా ఉందని... దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఆర్జేడీని ఆహ్వానించాలంటూ వినతి పత్రం సమర్పించారు. అనంతరం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మాకు మొత్తం 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గవర్నర్‌ ముందు బల ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాం... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల బలం మాకు ఉన్నందున అందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. అంతేకాకుండా  జేడీయూపై అసంతృప్తిగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు  కొందరు తమతో టచ్‌లో ఉన్నారని... మాకు ఇతర పార్టీల నుంచి మద్దతు కూడా ఉందన్నారు. అనంతరం గవర్నర్‌తో భేటీకి సంబంధించిన సమాచారాన్ని... ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు తేజస్వి యాదవ్... కన్నడ సీన్ క్లైమాక్స్‌కు చేరుకున్న సమయంలో బీహార్‌లో ఇలాంటి వాదన తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.