తెలకపల్లి రవి: సీబీఎస్ఈకై జగన్ నిర్ణయం.. తెలుగు విద్యకు ఇక పూర్తిగా మంగళం..
ఆంధ్ర ప్రదేశ్‌లో ఒకటవ తరగతి నుంచి కేంద్రం ప్రభుత్వ సిలబస్ సీబీఎస్సీ అమలు చేయాని ముఖ్యమంత్రి జగన్ జారీ చేసిన ఆదేశాలు కొత్త విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ నిర్ణయంతో విద్యారంగ మౌలిక స్వరూపమే తలకిందులుగా మారబోతుంది. ఇంగ్లీషు మీడియం విషయంలో వలె దీనిపై పెద్ద వివాదం రాకుండా కేవలం ముఖ్యమంత్రి ఆదేశంగా అమలులోకి తెచ్చారు. దానికి ముందు విద్యావేత్తలతో, నిపుణులతో ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలతో ఎలాంటి చర్చ జరిగింది లేదు. గత ఆగష్టులో కేంద్రం విడుదల చేసిన ఎన్ఇపి2020 ఏక్‌భారత్ శ్రేష్టభారత్ పేరిట విద్యారంగంలో రాష్ట్రాల పాత్రను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడమే గాక బలీయమైన భాషా సాంసృతిక ప్రత్యేకతలు, సుదీర్ఘ అధ్యయన విజ్ఞాన సంప్రదాయాలు గల ఈ దేశ సమాఖ్య స్పూర్తికి భంగకరంగా వుందని పలు రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాయి. సంస్కృతాన్ని విధించే ఆలోచన కూడా దీనిలో వుందని ప్రసిద్ధ విద్యావేత్తలు హెచ్చరించారు. చారిత్రికంగా ఒక ప్రత్యేకత కలిగిన తొలి భాషారాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా హక్కుకోసం వైవిధ్యం కోసం నిలవకపోగా జగన్ దానికి మద్దతుపలికారు. ఈ నిర్ణయం భారత దేశంలో భాషా రాష్ట్రాల వైవిధ్య సంస్కృతికి మాత్రమే గాక రాజ్యాంగం రాష్ట్రాలకిచ్చిన హక్కులకు కూడా తీవ్ర విఘాతం కలిగించే పరిణామం. రాజ్యాంగ నిర్మాతలు దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని గమనంలో వుంచుకునే విద్యను పదకొండవ షెడ్యూల్లో ఉమ్మడి జాబితాలో చేర్చారు. అనాలోచితమైన అప్రజాస్వామికమైన రీతిలో ఇంగ్లీషు మీడియాన్ని తీసుకొచ్చిన ఫలితంగా తెలుగులో చదువుకునే అవకాశమే కుదించుకుపోగా ఇప్పుడు రాష్ట్ర స్థానిక అవసరాలు సంస్కృతీ సంప్రదాయాలు ప్రత్యేకతలకు సమాధి కట్టే కేంద్ర విద్యావిధానాన్ని ముఖ్యమంత్రి జగన్ అందరికన్నా ముందు నెత్తినపెట్టుకోవడం విశేషం. తెలంగాణలోనూ ఈ విధమైన నిర్ణయం జరిగినా అప్పటి నేపథ్యం వేరు, పైగా రాష్ట్ర సిలబస్‌పై అక్కడ కొంత కసరత్తు సాగుతూనే వుంటోంది.
సిబిఎస్ఇ సిలబస్ చదువుకోవడానికి ఇప్పుడు రాష్ట్రాల్లో ఏర్పాట్లు వున్నాయి. ఇటీవలికాలంలో అంతర్జాతీయ బిజినెస్ స్కూల్స్ అయితే అసలు కేంద్ర సిలబస్‌ను కూడా పాటించడం లేదు. సిబిఎస్ఇలో, ఇతర దేశాలలో ఏమైనా మంచి విషయాలుంటే రాష్ట్రాలు వాటిని చేర్చుకోవచ్చు. కాని ఒక రాష్ట్ర విధానానికి పాతర వేసి కేంద్రం పెత్తనాన్ని ఆమోదించడం, ఆ విధానంలో కలిసి పోవడం వేరు. అంటే ఇక మీదట ఆంధ్ర ప్రదేశ్‌కు ఒక విద్యా ప్రణాళికే అవసరం వుండదా? గతంలో తెలుగు మీడియంకే అవకాశం లేకుండా తెచ్చిన ఇంగ్లీషు మీడియంపైనే సుప్రీంకోర్టు తుదితీర్పు రావాల్సి ఉండగా.. ఈ లోగా మరో పెద్ద మార్పు చేస్తే విద్యారంగం కకావికలం అవ్వడం తథ్యం. ఈ మొత్తం ప్రహసనంలో నలిగిపోయేది నష్టపోయేది సామాన్యులే. అందులోనూ దారుణంగా దెబ్బతినేదిపేద మధ్య తరగతి పిల్లలు వెనకబడినవారు దళిత వర్గాలు. ఉన్నతోద్యోగుల కులీన వర్గాల పిల్లలు ఎక్కువగా అదే చదువుతుంటారు. సిబిఎస్ఇ సిలబస్ పై ఎవరికి ఏ ఆకర్షణువున్నా కొంతమంది వంతపాడినా దేశంలో నిరుద్యోగానికి, సమస్యలకు ఆ విద్యార్థులు కూడా అతీతంగా లేరు. కేవలం కొన్ని తరగతులలో వున్న భ్రమను సంతృప్తిపర్చడానికి కేంద్రం మెప్పుపొందడానికి తీసుకుంటున్న ఈ చర్య పర్యవసానాలు చాలా దారుణంగా వుంటాయి.
మానవ వనకెల వికాసం బాల్యదశలో విద్యాబోధన చాలా సృజనాత్మకంగా ఆయా తరగతులనూ వ్యక్తులనూబట్టి జరగాల్సిన ప్రక్రియ తప్ప మూసధోరణిలో అందరినీ ఒకేగాటకట్టలేము. ఈ విషయంలో ఎన్నో అనుభవాలు అధ్యయనాలు నివేదికలు వున్నాయి. విస్తృత సమాజానికి కోట్లాది కుటుంబాలకు భావితరాలకు సంబంధించిన ఇలాంటి అంశాపై సంబంధిత నిపుణులతో ప్రతినిధులతో సమగ్రంగా చర్చించి సహేతుకమైన శాస్త్రీయ పంథా తీసుకోవడం ఒక దీర్ఘకాల కర్తవ్యం. ప్రపంచమంతటా ఎక్కడ మంచి విద్యాపద్ధతుతు వున్నా మనం తీసుకోవచ్చు.. కానీ, మన అస్తిత్వాన్ని భౌగోళిక చారిత్రిక వరవడిని స్థానిక ప్రయోజనాలకు తిలోదకాలు వదలి ఒకే దేశం ఒకే మతం ఒకే మోడీ తరహాలో కాషాయ ఎజెండాతో కొట్టుకుపోతే రాష్ట్రాలకి రాజకీయంగా ఈ ప్రభుత్వాలకు కూడా మంచిది కాదు. దేశాన్నిచాపచుట్టినట్టు చుడుతున్న మోడీ సర్కారు విద్యారంగ ఆక్రమణలను నివారించడం ఇప్పుడు అన్ని రాష్ట్రా బాధ్యత.
మొదట తెలుగు మీడియంనూ తర్వాత తెలుగు చదువునూ తీసిపారేస్తే ముందు ముందు ఒక అస్తిత్వమే అగమ్యమవుతుంది. తెలుగునే చరిత్ర సంస్కృంతి భౌగోళిక అవసరాల ప్రాతిపదికగా మన పిల్లలను చదువుకోనివ్వండి. తాత్కాలిక రాజకీయలబ్దికోసం భావితరాలను అయోమయంలో నెట్టకండి. వాస్తవానికి మోడీ ఉద్దేశించిన నూతన విద్యావిధానంలో కేంద్రీకృత పెత్తనమే గాక విదేశీ సంస్థల చొరబాటు విద్యారంగ స్వాధీనంకూడా భారీగా జరగబోతుంది. కనుక ఈ మార్పుల ఉత్తరోత్తరా దేశీయతకూ చోటు లేకుండాచేస్తుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)