తెలకపల్లి రవి: వివేకా హత్య కేసుపై విజయమ్మలేఖ, డా.సునీత వ్యాఖ్యలు

తెలకపల్లి రవి: వివేకా హత్య కేసుపై విజయమ్మలేఖ, డా.సునీత వ్యాఖ్యలు

వైఎస్‌వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో జాప్యం గురించి ఆయన కుమార్తె డాక్టర్‌ సునీత చేసిన వ్యాఖ్యలు రాజకీయ సంచలనంలాగా ప్రచారం జరుగుతున్నది. వాస్తవంలో ఆమె ఢిల్లీలో సిబిఐని కులుసుకున్న తర్వాత ప్రస్తుతం దర్యాప్తు చేసే ఆ సంస్థ ఏమన్నదో తప్ప అన్నీ వ్యాఖ్యానించారు. ఆమె పెదనాన్న కుమారుడైన జగన్‌ ఎపి ముఖ్యమంత్రిగా వున్నారు గనక సహజంగా ఆ కోణమే వీటిలో ప్రధానస్థానమాక్రమించింది. కుటుంబ సభ్యుల ప్రమేయం వుండదని గతంలో తాను అమాయకంగానూ ఆవేశంలోనూ చెప్పానని ఆమె అన్నారు. తన సోదరుడు అధికారంలో వున్నా హంతకులను పట్టుకోవడంలో జాప్యం అన్న అంశం ప్రధానంగా చెప్పారు. ఆయనతో సహా అందరినీ కలిశాననీ తాను తట్టని తలుపు లేదని అంటూనే చంద్రబాబు నాయుడిని పవన్‌ కళ్యాణ్‌ను కలుసుకోలేదన్నారు. ఇక్కడ సమస్య ఏమంటే డా.సునీత కుమార్తెగా ఎంత బాధలో వున్నా ఆవేదన చెందినా దర్యాప్తు ఎవరి ఆధ్వర్యంలోనైనా ఖచ్చితమైన కాలపరిమితితో జరగవు. సిబిఐకి కేసు అప్పగించాని వారే కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్నారు గనక జగన్‌ ప్రభుత్వానికి బాధ్యత లేకుండా చేశారు. మూడవది కుటుంబ సభ్యురాలిగా ఆమె మాటలే అంతిమంగా వుండాలని లేదు. ఎందుకంటే వివేకానంద హత్య తర్వాత రకరకాల వ్యక్తిగత కుటుంబపరమైన కథనాలు విహారం చేశాయి. వాటన్నింటినీ ఆమె తోసిపారేశారు, ఇప్పుడు  రాజకీయ ప్రేరణే ప్రధానం అంటున్నారు. కుటుంబ సభ్యు రాజకీయ ప్రేరణ అంటున్నప్పుడు అంతకు ముందు వచ్చిన కథలు తోసిపారేయడం ఎలా సాధ్యం? పైగా ఇప్పుడు ఆమెను ఎక్కువగా బలపరుస్తున్న పార్టీ మీడియా సంస్థ ద్వారానే ఆ కథలు ఎక్కువగా ప్రచారమైనాయి. ఈకేసు రాజకీయాల్లో పడిపోవడం తనకు ఇష్టం లేదన్నారు గాని వాస్తవంగా ఢిల్లీలో మాట్లాడిన తర్వాత రెండు రోజులు రాజకీయమే నడిచింది. ఆఖరుకు జగన్‌ తల్లిగారైన వైఎస్‌ విజయమ్మ ఒక బహిరంగ లేఖనే విడుదల చేశారు.

    ఇటీవలి కాలంలో వైఎస్‌ షర్మిల తెంగాణలో పార్టీ ప్రారంభ సన్నాహాలు మొదలెట్టాక ఆమెకు వైఎస్‌ విజయమ్మ మద్దతు వున్నదనీ, మొత్తంకుటుంబం జగన్‌ను వ్యతిరేకిస్తున్నదనీ కథనాలు వచ్చాయి. కానీ ఈ లేఖతో అవన్నీ నిజం కాదని అనుకోవలసి వస్తుంది. ఈ లేఖ ఆమె రాయలేదని ఒక వాదన వింటున్నా ఆమాట ఆమెనుంచి వచ్చేవరకూ తనే రాశారని అనుకోవాలి. వివేకానంద హత్యకు సంబంధించిన తనదీ, జగన్‌, షర్మిలది ఒకటే మాట అని ఆమె పేర్కొన్నారు. హత్య జరిగినప్పుడు చంద్రబాబు అధికారంలో వున్నారని తాము ఆయన మంత్రివర్గ సభ్యుడైన ఆదినారాయణ రెడ్డిపై సందేహాలు వెలిబుచ్చామని పునరుద్గాటించారు. (సునీత న్యాయస్థానానికి అందించిన అనుమానితుల జాబితాలోనూ ఆదినారాయణ రెడ్డి పేరుంది. ఎంపి వైఎస్‌ అవినాశ్‌రెడ్డి పేరూ వుంది.) సిబిఐ విచారణ జరుపుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధంఏమిటని ప్రశ్నించారు. ఇదంతా మీడియాలో ఒక భాగం కావాలని చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. కుటుంబాలలో అంతర్గత వివాదాలు, అంతుపట్టని హత్య గురించి ఎన్ని వూహాగానాలైనా చేయవచ్చు. ఆరోపణలైనా వుండవచ్చు. కానీ ఆధారాలు, నిరూపణ కీలకమవుతాయి. వివేకానందరెడ్డి హత్యలో చంద్రబాబు, జగన్‌ ప్రభుత్వాలు గాని, సిబిఐ గాని ఇంతవరకూ అలాంటి ఆధారాలేవీ పంచుకున్నది లేదు. పట్టుకున్నదే లేదనిపిస్తుంది. ఇంతటి ప్రముఖుల హత్య కేసుల్లో మామూలు మాటలకు పైపై ఆరోపణలకు విలువేముంటుంది? వారివారికోణాను బట్టి అనుమానాలు చెబుతుంటారు గాని వాటిని నిగ్గు తేల్చవలసింది దర్యాప్తు సంస్థలే. ఆ బాధ్యత ఇప్పుడు సిబిఐపై వుంది. అది కుటుంబ సభ్యులే ఎంచుకున్నది. ఒప్పుకోలు ప్రకటనలు లేనిచోట సిబిఐ విజయాల శాతం చాలా తక్కువ అని దేశమంతటికీ తెలుసు. అయితే కేంద్రం అధ్వర్యంలోని సిబిఐని ఎపి ముఖ్యమంత్రి ప్రభావితం చేస్తున్నారని చెప్పడం అంతగా చెల్లుబాటయ్యేది కాదు. అందుకే సునీత కూడా ఆ విషయమై మాట్లాడటం నా పరిధికిమించింది అంటూ దాటేశారు. పథకం ప్రకారం చేసిన ఇలాంటి హత్యల్లో కొందరిని మినహాయించి కొందరి చుట్టూనే వూహాగానాలు తిప్పడం వల్ల ప్రయోజనం వుండదు. అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే గాని రాజకీయ ప్రచారంగా మార్చడం వల్ల దర్యాప్తులో అంగుళం కూడా ఉపయోగపడదు. సునీత ఆమె తల్లిగారు కోర్టుకు సిబిఐకి వెళ్లారంటేనే జగన్‌ ప్రభుత్వంపై విశ్వాసం లేదని ప్రకటించారు. సిబిఐ ఏదో చేయబోతుందనే పెద్ద కథలూ నడిచాయి గాని జరిగింది లేదు.  ఎప్పటికప్పుడు ఏవో కబుర్లతో కాలం గడపడం కంటే కట్టుదిట్టమైన దర్యాప్తుతో నిజాలను బయిటకు లాగడం నిందితులను నిగ్గు తేల్చడం ముఖ్యం. హత్య జరిగిన సమయంలో మీరంటే మీరు కారణమని ఆరోపించుకున్న వైసీపీ, టీడీపీ నేతలు కూడా తమ తమ ఆధారాలను అందించి అందుకు సహకరించవచ్చు. అంతేగాని నాలుగు రోజులపాటు రాజకీయ సంచనం వల్ల సాధించేది శూన్యం.