తెలకపల్లి రవి : ఎపి లోకల్‌ వార్‌ కారకులెవరు ? ముగింపు ఎక్కడ ?

 తెలకపల్లి రవి : ఎపి లోకల్‌ వార్‌ కారకులెవరు ? ముగింపు ఎక్కడ ?

ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌(ఎపిఎస్‌ఇసి) నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వాయిదా పడిన స్థానిక ఎన్నిక గురించి ఈ రోజు జరిపిన అఖిలపక్ష సమావేశం ప్రతిష్టంభనను తొలగించ లేకపోయింది. అలా జరుగుతుందని ఎవరూ భావించ లేదు కూడా. ఎందుకంటే అఖిలపక్షం అనేది ఆయన తనుగానే తీసుకున్న నిర్ణయం కాబట్టి అధికార వైసీపీయే ఏకీ భవించ లేదు. హాజరు కానూ లేదు. పైగా ఆయన వ్యవహారశైలి తెలుగు దేశంకు అనుకూలంగా ఇంకా సూటిగా చెప్పాలంటే తొత్తులా వుందని గత విమర్శలను జగన్‌ ప్రభుత్వ మంత్రులు, పార్టీ ప్రతినిధులు పునురుద్ఘాటించారు. ఈయన వుండగా ఎన్నికలు నిష్పక్ష పాతంగా జరుగుతాయని ఎలా నమ్ము లేమని స్పష్టీకరించారు. అంటే గతంలోని దురదృష్టకర వివాదాల తర్వాత న్యాయపరమైన ఆదేశాల అమలు కోసం అనివార్యంగా ఆయనను పునర్నియామకం జరిపినప్పటికీ  ఎన్నిక నిర్వహణ మాత్రం జరిపే ఆలోచనలో ప్రభుత్వం లేదని తేలిపోయింది.

రాజ్యాంగ సంస్థ అయిన ఎస్‌ఇసి పట్ల ఈ విధంగా ప్రవర్తించడం ఏమిటిని ప్రభుత్వాన్ని ఆక్షేపించేవచ్చు గాని ఆయన ధోరణిని కూడా ఆమోదించడం కష్టం. గతంలో ఎన్నిక వాయిదాకు వ్యతిరేకంగా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లినప్పుడు కరోనా నేపథ్యంలో జరిగి పోయిన ఆ నిర్ణయాన్ని మళ్లీ తిరగదోడద్చలేదని న్యాయ స్థానం చెప్పింది. ఎన్నిక నిర్వహణ తమ రాజ్యాంగ హక్కు గనక 32వ అధికరణం కింద ఈ పిటిషన్‌ వేసే అధికారమే రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఎస్‌ఇసి తరపు న్యాయవాది వాదించగా ఆచర్చలోకి వెళ్లబోవడం లేదని పక్కకు పెట్టింది. అయితే కీలకమైన అంశమేమంటే ఎన్నిక వాయిదా వేసే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి వుండాల్సిందని స్పష్టం చేసింది. ఈసా రి తేదీ నిర్ణయించే ముందు మాట్లాడాలని ఆదేశించింది. భిన్న వ్యవస్థ సమతూకాన్ని కోరేవారెవరైనా గమనించాల్సిన అంశాలివి.

ముఖ్యమంత్రి కూడా టీవీస్క్రోలింగ్‌ ద్వారా ఎన్నిక వాయిదా తెలుసుకునే పరిస్థితి వూహకందేది కాదు. కాని జరిగింది అదే. ఆ ఆగ్రహంలో ముఖ్యమంత్రి జగన్‌ కొన్ని పొరబాటు ఆరోపణలు చేసిన మాట నిజమే గాని అవతలి వైపు జరిగిన ఉల్లంఘన కూడా తీవ్రమైందే. తన భద్రత గురించి రాసిన లేఖలో రాజకీయ భాష అందరూ గమనించారు. ఆవూపులోనే ఆర్డినెన్స్‌ ద్వారా నిమ్మగడ్డ తొలగింపు, జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం వంటివి జరిగాయి. అది చెల్లదని ప్రకటించిన హై కోర్టు ఆదేశాన్ని సుప్రీం కోర్టు కూడా ఆమోదించడంతో అనేక మల్లగుల్లాలు ఆలస్యం తర్వాత రమేష్‌ పున: ప్రతిష్టించ బడ్డారు.

ఇన్ని అనుభవాల తర్వాతనైనా ఎస్‌ఇసి తగు జాగ్రత్తలు తీసుకుంటుందని ఆశించడం సహజం.  రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించేవారు రాజకీయ పార్టీ వలె వ్యవహరించే అవకాశం వుండదు. కాని జరిగింది మాత్రం అదే. ప్రభుత్వంతో ఎస్‌ఇసి వ్యవహార శైలి ఉప్పు నిప్పులానే వుండిపోయింది. పంతాలు పట్టుదలలు ఘనీభవించి ప్రతిదీ న్యాయస్తానాలకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఇటీవలే దీనిపై హైకోర్టు కూడా ఆగ్రహపూరిత వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది. ఆ సమయంలోనే నిమ్మగడ్డ ఎలాంటి సంప్రదింపు లేకుండా స్థానిక ఎన్నికపై అఖిలపక్షం ప్రకటించారు. పేరుకు అఖిలపక్షం అన్నా విడివిడిగానే అభిప్రాయసేకరణ అన్నారు. ఎన్నిక సంగ సమావేశాలలో దీర్ఘకాలంగా పాల్గొంటున్న వారికి ఇలా విడివిడిగా కలుసుకోవడం అరుదని బాగా తెలుసు. కోవిడ్‌  కారణంగా భౌతిక దూరం నిబంధన ఆయనకు అక్కరకు వచ్చింది గాని అదే తన ప్రతిపాదనకు ప్రతి సూత్రంగా వస్తుందని ఆయన వూహించి వుండరు. వచ్చిన నాయకులలలో అచ్చెం నాయుడు మాత్రమే  నిమ్మగడ్డకు పూర్తి మద్దతు నిచ్చారు.

పైగా గతంలో ఘర్షణలను కూడా గుర్తు చేశారు. అన్నిటినీ మించి ఎన్నిక కోసం కేంద్ర బలగాలను రప్పించాలనే వింత కోర్కెతో ఫెడరల్‌ స్పూర్తికి విఘాతం కలిగించారు. కాంగ్రెస్‌ నాయకుడు మస్తాన్‌ వలీ కొత్త జిల్లాల ప్రకటన తర్వాతనే ఎన్నికలు జరపాలని అన్నారు. సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కూడా ఎన్నికలు జరపాలాని కానే గతంలో నోటిఫికేషన్‌ రద్దు చేయాని కోరారు. సిపిఎం నాయకుడు వై.వెంకటేశ్వరరావు ఎన్నికు జరపాలంటూనే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలని సమన్వయ పూర్వకమైన సూచన చేశారు, కరోనా ఇంకా తగ్గకపోవడం, నవంబరు నుంచి పాఠశాల పున:ప్రారంభం, ఇటీవలి వరదలు తదితర అంశాలు కూడా గుర్తు చేశారు, గతంలో ఏకగ్రీవాపై వచ్చిన ఫిర్యాదును సరిచేయాలన్నారు గాని కొత్తగా నోటిషికేషన్‌ ఇవ్వాని చెప్పలేదు. వివాదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికు జరపాని స్పష్టం చేశారు.  బిజెపి, బిఎస్‌పిు కూడా ఎన్నికలు జరగాలని చెప్పాయి. ఈ సమావేశంపై  ఎస్‌ఇసి నోట్‌ విడుదల చేయగా వైసీపీ విరుచుకుపడిరది. నిమ్బగడ్డ దాన్ని ఖండించారు కూడా.

కట్‌చేస్తే.. ఎస్‌ఇసి రాష్ట్ర ప్రభుత్వ అధికారుతో సమావేశమైనారు. ఆఖరును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలమ్ సాహ్ని కూడా కలిశారు. అందరూ ఎన్నికలకు వాతావరణం అనుకూంగా లేదని చెప్పేశారు.  మరో దఫా కోవిడ్‌ వ్యాప్తి పొంచి వుందన్నారు. ఇక సిఎస్‌ నీలమ్ సరైన సమయం తాము తెలియజేస్తామన్నారు. ఇప్పుడు బంతి ఎవరి కోర్టులో వుంది? ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎస్‌ఇసి వదిలేస్తారా? లేక మళ్లీ నిర్ణయాధికారం తనదే నని ముందుకు వెళతారా? సహకారం లేదని నిజమైన కోర్టుకు వెళతారా? ఇవేవీ వాంఛనీయమైనవి కావు. గతంలో వచ్చిన వివాదాలు పునరావృతం కాకుండా చూడవసిన సమయంలో  ఇటు నిమ్మగడ్డ అటు ప్రభుత్వం కూడా చర్చించి సహేతుకమైన సమ్మతమైన సమయాన్ని నిర్ణయించాలి తప్ప అవిశ్వాస అసహనాలు ఏకపక్ష పోకడలతో పట్టుదలకు పోతే నష్టం. తాము సంప్రదింపులలో వచ్చిన అభిప్రాయాను గౌరవిస్తానని చెప్పిన నిమ్మగడ్డ  అధికారులతో చర్చను కూడా దృష్టిలో పెట్టుకుంటారని ఆశించాలి. ఇది ఇలా జరుగుతుందని తెలిసీ ఆయన అడుగు వేశారంటే కారణం ఏమిటి? తిరిగివచ్చాక తాను ఏ చొరవ చూపలేదనే విమర్శ లేకుండా చేసుకోవడానికా? కాదంటే కోర్టులో మళ్లీ వివాదం మొదలవుతుందా? కాకూడదనే కోరుకోవాలి