తెలకపల్లి రవి : దుబ్బాక టు తిరుపతి వయా జిహెచ్‌ఎంసి : తెలుగు రాష్ట్రాలో బిజెపి మ్యాప్‌

తెలకపల్లి రవి  : దుబ్బాక టు తిరుపతి వయా జిహెచ్‌ఎంసి : తెలుగు రాష్ట్రాలో బిజెపి మ్యాప్‌

రాజకీయాలు ఎన్నికలు ఎంతో దగ్గరగా దీర్ఘకాలంగా చూస్తున్నవారికి కూడా జిహెచ్‌ఎంసి కోసం బిజెపి చేస్తున్న హడావుడి అంతుపట్టడం లేదు. ఆ పార్టీ అద్యక్షుడు జెపి నడ్డా, అత్యంత శక్తివంతుడైన మాజీ అద్యక్షుడు హోం మంత్రి అమిత్‌ షా తో సహా పార్టీ అగ్రనాయక దళం మొత్తం ఒక కార్పొరేషన్‌ కోసం దిగిపోతుందా? ఇదంతా చాలక సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ముహూర్తంలోనే ప్రత్యక్షమై ప్రభావితం చేయడమా?ఈ రాకకు ఎన్నికకు సంబంధం లేదంటున్నా ఆ సమయంలో వచ్చాక రాజకీయాలో  ఆ మాటను పూర్తిగా విశ్వసించడం ఎలాగూ జరగదు.

దేశాన్ని రెండోసారి పాలిస్తున్న అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో వున్న ఒక బలమైన పాలక పార్టీ, కార్పొరేషన్‌ కోసం ఇంతగా పాకులాడుతుందా? పోనీ వీరంతా వచ్చినా ఆ పార్టీ బలం అమాంతం పెరిగి మేయర్‌ పీఠం కైవశమయ్యే అవకాశం ఏమన్నా వుందా అంటే అదీ కనిపించదు. కాని వ్యూహాలకు మారుపేరైన బిజెపి సంఘ పరివార్‌ ఏ కారణం లేకుండా ఇంత హంగామా చేయదు కదా? అన్నది అసలైన ప్రశ్న, బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌ వంటివారు ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన భాషను చూపిన ఉద్రేకాన్ని కూడా కలిపి చూస్తే ఈ ప్రశ్న మరింత పెద్దదవుతుంది.

             

ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో ఈ హడావుడిలో పదోవంతు కూడా కనిపించలేదు. కానీ అక్కడ విజయం సాధించడం వారికి ఎంత వూపునిచ్చిందో ఆశలు అత్యాశలుగా ఎలా మార్చిందో  జిహెచ్‌ఎంసి ప్రచారం ప్రస్పుటం చేసింది. మీడియాలో పెద్దభాగం ఇందుకు తోడైంది. జిహెచ్‌ఎంసి అన్న నాటి నుంచి బిజెపిపై ఫోకస్‌ పెట్టి వారేదో సహజ సవాలుదారులైనట్టు కథనాలు పొంగిపొర్లుతున్నాయి.బండి సంజయ్‌ బడాయి మాటలు, హిందూత్వ భాష ఇందుకు మరింత అవకాశమిచ్చాయి. భాగ్యలక్ష్మి ఆయం దగ్గర ప్రమాణ ప్రహసనంతో మొదలైన ఈ వ్యవహారం సర్జికల్‌ స్ట్రయిక్స్‌ తో పరాకాష్టకు చేరాయి. 

మజ్లిస్‌ వైపునుంచి చూస్తే  అసదుద్దీన్‌ ఒవైసీ బిర్యానీ ఆఫర్‌ తో మొదలై అక్బరుద్దీన్‌ ఒవైసీ  ఎన్టీఆర్‌ పివి నరసింహారావు సమాధాల సవాలుతో తారస్థాయినందుకున్నాయి.  ఈ మధ్యలో టిఆర్‌ఎస్‌  తరపున కెటిఆర్‌ తదితరులు ఇద్దరినీ ఖండిస్తూ పాలక పార్టీగా తన ప్రచారం తను సాగిస్తున్నారు. మజ్లిస్‌ను ముందు పెట్టి  దానికీ తమకూ దోస్తీ వుందన్న ప్రచారానికి జవాబుగా కెటిఆర్‌ మజ్లిస్‌ తమ ప్రధాన ప్రత్యర్తి అని ప్రకటించేవరకూ వెళ్లారు. ఒక విధంగా ఇది బీజేపీ కోరుకున్న పరిణామమే.

          

తను కోరుకున్న ఎజెండాను ముందుకు తేవడంలో ఫలప్రదమైన బిజెపి ఇప్పుడు ఓటర్ల మనసుల్లో ఒక పెద్ద ముద్ర వేయడం తన తదుపరి వ్యూహంగా పెట్టుకుంది. గెలుపు ఓటములు వచ్చే స్తానాలు ఎలా వున్నా ఒక పెద్ద జాతీయ పార్టీగా రాబోయే ప్రత్యామ్నాయంగా కనిపించాలి గనకే ఇందరు నాయకులు రంగంలోకి  వస్తున్నారు. ప్రధాని మాట్లాడకపోయినా వచ్చారంటే తన మాటలు సంకేతాలు బాగా ప్రచారమవుతాయి. తమ రాష్ట్ర నాయకులు మాట్టాడిన దుందుడుకు భాషను గనక  అమిత్‌ షా నడ్డా వంటివారు ఖండించలేదంటే ఆశీర్వదించారనే అనుకోవాల్సి వస్తుంది.

 

అంటే పై నుంచి కింది వరకు  పథకం ప్రకారమే ఇదంతా మాట్లాడారని చెప్పాల్సి వస్తుంది. బీహార్‌ నుంచి బల్దియా వరకూ మజ్లిస్‌ రంగంలో వుండి మత పరమైన విభజన తీసుకురావడానికి దోహదం చేసినట్టు అర్థమవుతుంది. హైదరాబాద్‌  మత సామరస్యానికి పెట్టింది పేరు గనక ఇప్పటివరకూ ఎవరు ఏమి మాట్లాడినా ప్రజలు ప్రశాంతంగానే ఉన్నారు. ఇక ముందూ వారిలాగే స్పందిస్తారు అనడంలో సందేహం లేదు. కాని బిజెపి అగ్రనేతలు రాక,మీడియాలో సృష్టించుకున్న హైప్‌ కారణంగా నగర జనాభాలో మధ్య తరగతి వర్గంపైనా యువత పైనా ప్రభావం ప్రసరించవచ్చు. అలాగే ఇతర పార్టీ నుంచి వచ్చేవారిని చేర్చుకోవడం ద్వారా తామే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్‌ కథ ముగిసిందని చెప్పుకోవచ్చు, ఈ రెండు మూడు రోజుల్లో ఆ తరహా చేరికలు లేదా ఫిరాయింపు భారీగానే జరగవచ్చు.

ఇది ముదిరిపోయి టిఆర్‌ఎస్‌ నుంచి కూడా ముప్పై మందికి పైగా ఎంఎల్‌ఏలు తమలోకి వస్తున్నట్టు కొందరు బిజెపి నేతు బడాయి పోతున్నారు. విచిత్రంగా కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌ రెడ్డి కూడా  అదే అంటున్నారు, ఫిరాయింపును ప్రోత్సహించిన కెసిఆర్‌ దానికే బలైపోతాడంటున్నారు. పదవులు రాని వారు ఆశాభంగం పొందినవారు పార్టీ మారవచ్చు గాని  సిట్టింగ్‌ లు ఎవరూ బయిటకు పోయేంత పరిస్తితి వూహించడానికి లేదు. ఉన్నా లేకున్నా అలాంటి చిత్రణ ఇవ్వడానికి  హంగామా చేయడం బిజెపికి బాగా తెలుసు. కొంతమంది అంటున్నట్టు ఇది గొప్ప గుణమేమీ కాదు సరికదా మేడిపండు వ్యవహారం లాటిదే.  ఉత్తర భారతంలో బలం తగ్గుముఖం పట్టేలోగా దక్షిణాన కొంతైనా చోటు సంపాదించాన్నది బిజెపి ఆలోచన. ఆరాటం, కర్ణాటకలో వారి బలం  గాలి జనార్ధనరెడ్డి పైన యడ్యూరప్ప పైన ఆధారపడి ఉంది. తదుపరి అవకాశాలు తెలంగాణలో వెతుక్కోవాలని కోరుకుంటున్నారు. ఆంధ్రాలో కొంత  ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. దుబ్బాక టు తిరుపతి వయా జిహెచ్‌ఎంసి అన్న బృహత్‌ పథకం తెలుగు రాష్ల్రాల్లో పాగా వేయడానికి పనికి వస్తుందో లేదో ప్రజలే తేల్చిచెబుతారు.