శరత్‌ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు

శరత్‌ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు

అమెరికాలో దుండగుల కాల్పుల్లో మరణించిన తెలుగు విద్యార్థి శరత్‌ కొప్పు కుటుంబాన్ని తెలంగాణ మంత్రులు పరామర్శించారు. మంత్రులు కేటీఆర్‌, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లు ఈ రోజు ఉదయం అమీర్‌పేట్‌లోని శరత్‌ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శరత్‌ తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యార్ధి శరత్‌ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు కేటీఆర్‌ చెప్పారు. వీలైనంత త్వరలో శరత్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు  ప్రయత్నిస్తున్నామని కడియం తెలిపారు.

వరంగల్‌ జిల్లాకు చెందిన శరత్‌ అమెరికాలోని మిస్సోరి యూనివర్సిటీలో చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో కన్సాస్‌లోని రెస్టారెంట్‌లోకి దుండగులు చొరబడి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో శరత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కన్సాస్‌ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని శరత్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఈ హత్యపై కేన్సాస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో రెస్టారెంట్ సమీపంలోని వీడియో పుటేజీలో ఒక అనుమానితుడుని కనుక్కున్నారు. ఈ వీడియోలో నల్లజాతీయుడు అటూ, ఇటూ తిరగడం కనిపించింది.