హైకోర్టు ముందుకు ఏపీ, టీఎస్ డేటా పంచాయతీ..

హైకోర్టు ముందుకు ఏపీ, టీఎస్ డేటా పంచాయతీ..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య డేటా వార్ ముదురుతోంది. హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థలో సైబరాబాద్ పోలీసులు సోదాలు, ఏపీ పోలీసుల హడావిడి తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరోవైపు డేటా చోరా పంచాయతీ హైకోర్టుకు చేరింది. మిస్సింగ్ అయిన ఐటీ గ్రిడ్స్ కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులను ఇవాళ తమ ముందు హాజరుపర్చాలని తెలంగాణ పోలీసులు ఆదేశించారు న్యాయమూర్తులు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్న భాస్కర్, ఫణి, విక్రమ్ గౌడ్, చంద్రశేఖర్‌ను హైకోర్టు ముందు హాజరపర్చనున్నారు. తమ ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించారంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు ఐటీ గ్రిడ్స్ ఉద్యోగి అశోక్... ఈ విషయంపై కుందన్ బాగ్ లో జస్టిస్ ఆర్.ఎస్. చౌహన్, జస్టిస్ షమీంఅక్తర్ ముందు పిటిషనర్, మాదాపూర్ సీఐ హాజరయ్యారు. సెక్షన్ 160 కింద ఎవరికి నోటీసులు ఇవ్వలేదని, కేసు విషయంలో కనీసం డైరీలో కూడా పోలీసులు పొందు పరచలేదని న్యాయమూర్తి ముందు తెలిపిన పిటిషనర్. తమ ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో కూడా సమాచారం ఇవ్వలేదని తెలిపారు పిటిషన్ అశోక్. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తులు. ఇవాళ తెలంగాణ హై కోర్టులో నలుగురు ఉద్యోగులను హాజరు పరచాలని ఆదేశించారు. కాగా, టీడీపీకి సాంకేతిక సేవలందిస్తున్న మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ‘ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థలో ఏపీలోని ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితా, ఆధార్‌, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు అక్రమంగా ఉన్నాయంటూ కేపీహెచ్‌బీ ఇందు ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌లో ఉండే డేటా అనలిస్ట్‌ తుమ్మ లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ కార్యాలయంలో పోలీసులు నిన్న కూడా సోదాలు నిర్వహించారు. కేసు దర్యాప్తునకు సహకరించే సమాచారం కోసం ఆరా తీశారు. ఇప్పటికే పోలీసులు అక్కడ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలోని కీలక సమాచారాన్ని క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో భద్రపరిచినట్లు భావిస్తుండటంతో దాన్ని డీకోడ్‌ చేసేందుకు నిపుణుల సహాయంతో ప్రయత్నిస్తున్నారని సమాచారం.