నేడు అసెంబ్లీ ముందుకు ద్రవ్యవినిమయ బిల్లు !

నేడు అసెంబ్లీ ముందుకు ద్రవ్యవినిమయ బిల్లు !

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈనెల  14 నుంచి ప్రారంభమైన సమావేశాల్లో మొదటి రెండు రోజులు బడ్జెట్‌పై సాధారణ చర్చ కొనసాగింది. ఆ తర్వాత హౌసింగ్, సాంఘిక, గిరిజన, మహిళా, మైనార్టీ, స్త్రీ, శిశు, వికలాంగ సంక్షేమ శాఖల పద్దులపై సభ చర్చించింది. 17న  మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, విద్యుత్‌ అంశా లు, 18న రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, హోం, వ్యవసాయం, అనుబంధ శాఖలు, పౌర సరఫరాల శాఖ పద్దులపై చర్చించారు.

19న తెలంగాణ సచివాలయంపై చర్చ జరిగింది. 20న అసెంబ్లీ బేదికగా సింగరేణి కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు సీఎం కేసీఆర్. దసరా పండుగకు బోనస్ ఇచ్చారు. గత ఏడాది 27శాతం లాభాలను పంచిన ప్రభుత్వం ఈసారి మరో శాతం అదనపు వాటా ఇచ్చారు. నిన్న సభలో ఎలాంటి చర్చ లేకుండానే కీలకమైన మున్సిపల్ సవరణ బిల్లుని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.  ఈ బిల్లును ఐటీ,మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

పౌరులే పాలకులు కావాలనే ఉద్దేశ్యంతోనే మున్సిపల్ సవరణ బిల్లు తెస్తున్నామని కేటీఆర్‌ అన్నారు. అలాగే తెలంగాణ సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. కేసుల సత్వర పరిష్కారం, కోర్టుల విధుల నిర్వహణలో సమతుల్యత లభిస్తుందని చెప్పారు. అనంతరం సభ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న కాలానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం పద్దులపై చర్చలో విపక్షాలపై ఎదురుదాడికి దిగింది.