కొత్త పురపాలక బిల్లుకు ఇవాళే ఆమోదం..

కొత్త పురపాలక బిల్లుకు ఇవాళే ఆమోదం..

తెలంగాణ పురపాలక చట్టం 2019ని ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించనుంది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. మున్సిపల్ యాక్ట్ 1965, మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1994 స్థానంలో కొత్త బిల్లును తీసుకొచ్చారు. బిల్లులో మొత్తం 299 సెక్షన్లున్నాయి. బిల్లు పరిధిలోకి రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్లు వస్తాయి. కొత్తగా హైదరాబాద్‌ శివారులో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. వాటిని కూడా బిల్లు పరిధిలోకి తీసుకొచ్చింది. ఎన్నికల నిర్వహణ, పాలకమండళ్ల అధికారాలు, ఛైర్‌పర్సన్ చేయాల్సిన అంశాలు, మున్సిపాలిటీల నిధులు, విధులను బిల్లులో పొందుపరిచారు. పచ్చదనం, పరిశుభ్రతను చైర్‌పర్సన్లను బాధ్యులను చేశారు. మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఇతర అంశాలను కూడా బిల్లులో చేర్చారు. 

మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైఎస్ చైర్‌పర్సన్లను సస్పెండ్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చింది కొత్త బిల్లు.. పర్యవేక్షణ అధికారులు కూడా వారికే అప్పగించింది. చైర్‌పర్సన్, వైఎస్ చైర్‌పర్సన్లను తొలగించే అధికారం.. మున్సిపాలిటీలను రద్దుచేసే అధికారాన్ని ప్రభుత్వానికే కలిపించారు. మధ్యాహ్నం అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును ఆ తర్వాత శాసనమండలిలోనూ ప్రవేశపెట్టనున్నారు సీఎం కేసీఆర్.. ఆ వెంటనే చర్చించి మండలి ఆమోదం తీసుకుంటారు. కొత్త మున్సిపల్ బిల్లుకు ఆమోదం లభించగానే డిప్యూటీ చైర్‌మన్ మండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తారు.