ఉద్రిక్తంగా మారుతున్న తెలంగాణా బంద్

ఉద్రిక్తంగా మారుతున్న తెలంగాణా బంద్

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్త బంద్  పిలుపు ఉద్రిక్తంగా మారుతోంది. బంద్ సందర్భంగా ఖమ్మం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం బస్టాండ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు, వివిధ పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. బంద్‌ ను పట్టించుకోకుండా పట్టణంలో తిరుగుతున్న ఆటోలపై ఆందోళనకారులు దాడిచేశారు. ఆటోలను ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ బండ్లగూడలో బంద్ ఉద్రిక్తంగా మారింది. ప్రైవేట్ డ్రైవర్ ను ఆర్టీసీ కార్మికులు చితకబాదారు. బంద్ అయినప్పటికీ డిపో నుంచి బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నం చేయడంతో ఈ దాడి చేశారు.

పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. నిజామాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో భారీ భద్రత నడుమ బస్సులను నడిపిస్తున్నారు. ప్రతి మూడు బస్సులకు ఒక ఎస్కార్ట్‌ వాహనాన్ని పంపిస్తూ బస్సులు డ్యామేజీ కాకుండా చూస్తున్నారు. ప్రస్తుతం ఎస్కార్ట్‌ వాహనాలు లేకుండా బస్సులను నడిపించలేని పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్చందంగా షాపులు మూసేయగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు దగ్గరుండి షాపులు మూసేయించారు.