నడ్డా టీమ్‌లో చేరే తెలంగాణ బీజేపీ నేతలు ఎవరు?

నడ్డా టీమ్‌లో చేరే తెలంగాణ బీజేపీ నేతలు ఎవరు?

బీజేపీ కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి ఎంత మందికి చోటు దక్కనుంది? ఢిల్లీ పెద్దల దృష్టిలో ఎంత మంది ఉన్నారు? ఎవరికి ప్రమోషన్‌ లభిస్తుంది? బీజేపీలో చేరిన మాజీ మంత్రులు.. మాజీ ఎంపీల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం తెలంగాణ కమలనాథుల్లో జరుగుతున్న చర్చ ఇదే. 
 
బీజేపీ సీనియర్లకు కేంద్ర కమిటీలో చోటు కల్పిస్తారా? 

బీజేపీ కేంద్ర కమిటీ ప్రకటన ఎప్పుడైనా ఉండొచ్చని పార్టీ నేతలు అనుకుంటున్నారు.  జాతీయ అధ్యక్షుడు JP నడ్డా టీమ్‌లో తెలంగాణ నుంచి చోటు దక్కించుకునే వారిపైనా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీలో కొత్తగా చేరిన వారిని గుర్తించి పిలుస్తారా? బీజేపీలో అనేక ఏళ్లుగా ఉంటున్న సీనియర్లకు ఛాన్స్‌ ఉంటుందా? మొత్తంగా తెలంగాణకు జాతీయ కమిటీలో ప్రాతినిథ్యం పెరుగుతుందా అన్న చర్చ జోరందుకుంది. 
 
ఇప్పటికే రాష్ట్ర కమిటీ కూర్పుపై పార్టీ నేతల్లో అసంతృప్తి!

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర కమిటీని అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇటీవలే ప్రకటించారు. రాష్ట్ర కార్యకవర్గ సభ్యులను, జిల్లా ఇంఛార్జ్‌లను, వివిధ విభాగాలకు బాధ్యులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే  రాష్ట్ర కమిటీ కూర్పుపై పార్టీ  సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో కేంద్రం కమిటీలో ఎవరిని తీసుకుంటారు? అసంతృప్తితో ఉన్న సీనియర్లను ఎలా బుజ్జగిస్తారన్నది ప్రశ్నగా ఉంది. 
 
గతంలోనే బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన లక్ష్మణ్‌!

ప్రస్తుత జాతీయ కమిటీలో తెలంగాణ నుంచి  ప్రధాన కార్యదర్శిగా మురళీధర్‌రావు ఉన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పేరాల చంద్రశేఖర్‌రావు ఉన్నారు. మొన్నటి వరకూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌ అంతకుముందే పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయనకు ప్రస్తుతం పార్టీలో ఎలాంటి బాధ్యత అప్పగించలేదు. అలాగే హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా వెళ్లడానికి ముందు వరకూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా బండారు దత్తాత్రేయ ఉండేవారు. 
 
పదవులు ఇవ్వకపోతే అసంతృప్తి  తప్పదా? 

ఈసారి కేంద్ర కమిటీలో చోటుకోసం పెద్ద లిస్టే ఉందట.  పాత నేతలతోపాటు.. పార్టీలో కొత్తగా చేరిన వారితో కలిపి  చాలా మంది చోటుకోసం  ప్రయత్నాలు చేస్తుకుంటున్నారట. ముఖ్యంగా మురళీధరరావును జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తారా లేక.. రాజ్యసభకు పంపుతారా అన్నదానిపై చర్చ జరుగుతోంది. పార్టీలో సీనియర్లగా గుర్తింపు పొందిన వారికి బీజేపీలో కీలక బాధ్యతలో.. ప్రభుత్వ పదవులో ఇవ్వకపోతే అసంతృప్తితో ఉండే అవకాశం ఉందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారట. 
 
ఢిల్లీకి చేరిన తెలంగాణ బీజేపీ సీనియర్ల జాబితా!

ఆ మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేస్‌లో నిలిచిన మాజీ మంత్రి డీకే అరుణతోపాటు.. బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెవ్వి, మాజీ ఎంపీ గరికపాటి మోహనరావు తదితరులు కేంద్ర కమిటీలో చోటు కోసం ఎదురు చూస్తున్నారట. మరి.. వీరిలో ఎవరు ఢిల్లీ పెద్దల ఫోకస్‌లో ఉన్నారో తెలియాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతల్లోని  సీనియర్ల జాబితా ఢిల్లీ కేంద్రం పార్టీ ఆఫీస్‌కు చేరినట్లు సమాచారం. వీరిలో నడ్డా ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాల్సిందే.