సింహం సింగిల్‌గానే స్వీప్ చేస్తుంది...

సింహం సింగిల్‌గానే స్వీప్ చేస్తుంది...

సార్వత్రిక ఎన్నికల్లో సింహం (బీజేపీ) సింగిల్ గానే వస్తోంది.. సింహం సింగిల్‌గా స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన ఆయన.. ఇద్దరు చంద్రుల్లో ఒకాయన అడవిబాట, ఇంకొకరు రాష్ట్రాల బాట పట్టారు.. కేసీఆర్, చంద్రబాబు ఏకమైనా బీజేపీని ఏం చేయలేరన్నారు. ఇక పేకాటలో జోకర్ లాంటోడు చంద్రబాబు అని హాట్ కామెంట్లు చేసిన లక్ష్మణ్.. కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్‌లో విలీనం అయితే బెటర్ అంటూ సెటైర్లు వేశారు. గాంధీభవన్‌కు టూ లెట్ బోర్డు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. బీజేపీ ఒంటరిగానే గెలవబోతోందని ఎప్పటినుండో చెపుతున్నాం.. మోడీ అవినీతి రహితపాలన, సంక్షేమం వల్లే ప్రజలు మళ్లీ బీజేపీ వైపు నిలిచారన్నారు లక్ష్మణ్. 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా జీఎస్టీ అమలు చేయలనుకున్నారు.. కానీ, సాహసం చేయలేకపోయారన్న లక్ష్మణ్... దేశ భద్రతే ముఖ్యమని మోడీ సర్జికల్ స్ట్రయిక్స్ లాంటి సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారన్నారు. కేసీఆర్ కి మసూద్ అజహర్ పై ఉన్న నమ్మకం దేశ ప్రధానిపై లేదని మండిపడ్డ టీఎస్ బీజేపీ అధ్యక్షుడు... మళ్లీ రామరాజ్యం రాబోతోందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దోచుకున్న డబ్బు దాచుకొనివ్వడనే మోడీని ప్రధాని కాకుండా చేయాలనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి 300 పైగా సీట్లు వస్తాయని అన్ని సర్వేలు స్పష్టం చేశాయన్న లక్ష్మణ్.. బీజేపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నిలబడ్డారు. తెలంగాణ కూడా మరో బెంగాల్ గా మారబోతోంది.. బీజేపీ, టీఆర్ఎస్ నువ్వా నేనా అనేలా పోరాడే రోజులు రాబోతున్నాయన్నారు. హిందూ టెర్రరిజం, హిందువులు బొందువులు అన్న నాయకులకు ప్రజలు బుద్ధిచెబుతారని హెచ్చరించిన లక్ష్మణ్.. కుల ప్రస్తావన, మత ప్రమేయం లేని రాజకీయాలే మోడీ లక్ష్యం అన్నారు.