కేబినెట్‌లో చోటు దక్కించుకుంది వీరే..!

కేబినెట్‌లో చోటు దక్కించుకుంది వీరే..!

రేపటి తెలంగాణ కేబినెట్ ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రేపు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న వారికి సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. రేపు ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్ వేదికగా మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. అందరికీ ఇప్పటికే అధికారికంగా సమాచారం అందించారు. కొందరికి సీఎంవో నుంచి ఫోన్ కాల్స్ వెళ్లగా... మరికొందరు సీఎంను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు తొమ్మిది మందికి అధికారికంగా సమాచారం అందింది. వీరిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ నేరుగా సీఎంను కలిశారు. మిగతా ఐదుగురికి ఫోన్ కాల్స్ వెళ్లాయి... అందులో ఈటెల రాజేందర్, జగదీష్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 10 మందికి సమాచారం ఇచ్చారు. 

ఇక ఇందులో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా, ముగ్గురు బీసీ, ఒకరు వెలమ, ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. అత్యధికంగా ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఉండడం విశేషం. ఖమ్మం జిల్లా మినహా మిగతా అన్ని ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిథ్యం దక్కనుంది. మొత్తం 18 మందికి అవకాశం ఉండగా.. సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, కొత్తగా ప్రమాణస్వీకారం చేయనున్న 10 మందితో కలిపి.. మంత్రుల సంఖ్య 12కు చేరుకోనుండగా.. మిగతా ఆరుగురు మంత్రులను పార్లమెంట్ ఎన్నికల తర్వాత అవకాశం కల్పించనున్నారు. ముఖ్యంగా పార్టీలో కీలకంగా ఉన్న కేటీఆర్, హరీష్‌రావు లాంటి వారున్నారు.