ఆర్టీసీ భవితవ్యం రేపు తేలుతుందా ?

ఆర్టీసీ భవితవ్యం రేపు తేలుతుందా ?

 ఆర్టీసీ భవితవ్యం రేపు తేలనుంది. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై కార్మికులతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది.  కార్మిక న్యాయస్థానంలో తేల్చుకుంటారా..? కార్మిక శాఖ కమిషనర్‌ స్థాయిలోనే సమస్య పరిష్కారమయ్యేలా చూస్తారా..? కార్మికులను విధుల్లోకి తీసుకుంటారా..? 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇస్తారా? సమస్య పరిష్కారానికి ఎలాంటి ముగింపు పలుకుతారనేది ఆసక్తికరంగా మారింది. ఆర్టీసీలో సగం బస్సులే ఉండేలా 5100 ప్రైవేటు బస్సులకు రవాణా అనుమతులు ఇచ్చేందుకు తెలంగాణ కేబినేట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. విధివిధానాల రూపకల్పన, ఇతర బాధ్యతలను రవాణాశాఖకు అప్పగించింది.

5100 రూట్ల ప్రైవేటీకరణ చట్టవిరుద్ధమని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. దీంతో కేబినెట్‌ నిర్ణయానికి అడ్డంకులు తొలగిపోయాయి. ప్రైవేటు బస్సులకు అనుమతులు ఇచ్చేందుకు వీలుగా ఎంపిక చేసిన మార్గాలపై త్వరలో నోటిఫికేషన్‌  కూడా జారీ చేయనున్నారు. రూట్ల ప్రైవేటీకరణపై ప్రభుత్వం ముందుకెళ్తే ఆర్టీసీ బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న 49వేల మంది సిబ్బంది అవసరం లేదు. అప్పుడు ఉద్యోగులు, సిబ్బందిని ఎలా తగ్గిస్తారన్నది ప్రశ్న. సిబ్బందిని ఎలా తగ్గిస్తారు? ఎలాంటి విధానం అనుసరిస్తారన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిర్బంధ లేదా స్వచ్ఛంద పదవీ విరమణ అమలు చేయవచ్చన్న వాదన ఉంది. దీనిపై సీఎం కేసీఆర్‌ మదిలో ఏముందన్నది తేలాల్సి ఉంది.