అదనంగా 400 టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకుంటాం..

అదనంగా 400 టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకుంటాం..

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అదనంగా 400 టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకుంటామని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా ఉందని, గోదావరి అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేస్తోందన్నారు. ధర్మపురిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గోదావరి నదిలో దాదాపు 100 టీఎంసీల నీరు 250 కిలోమీటర్ల మేర నిలిచింది. ఎవరూ ఊహించని ఘనత ఇది. అనుకున్న దాని కంటే బ్రహ్మాండంగా ప్రాజెక్టులు తయారయ్యాయని.. సజీవ గోదావరి నదిని తెలంగాణకు ఇచ్చినందకు ఇరిగేషన్ అధికారులను అభినందించాలన్నారు. తెలంగాణ భవిష్యత్‌ కోసం శాశ్వత సాగునీటి వనరులు సమకూరుస్తున్నామని వెల్లడించారు సీఎం కేసీఆర్. 

మేం అనుకున్నదానికంటే అద్భుత ఫలితాలు వస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్... 44  ఏళ్ల సీడబ్లూసీ రికార్డుల ఆధారంగా రీడిజైనింగ్ చేశామని వెల్లడించిన ఆయన.. కాళేశ్వరం ద్వారా అదనంగా 400 టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకుంటామని స్పష్టం చేశారు. 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించిన కేసీఆర్... మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి ప్రతీ రోజు 3 టీఎంసీల నీరు.. ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి మల్లన్నసాగర్‌కు ప్రతీరోజూ 2 టీఎంసీల నీరు వెళ్తున్నట్టు వెల్లడించారు. ఎల్లంపల్లి ఎండిపోవడం ఉండదన్నారు కేసీఆర్... అవసరాన్ని బట్టి ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌కు నీటి తరలింపు ఉంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 45 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. నెలకు 60 టీఎంసీల చొప్పున 6 నెలలపాటు నీటిని ఎత్తిపోస్తం. రామగుండం నుంచి అదనంగా 4వేల మెగావాట్ల కరెంట్‌ వస్తుందని తెలిపారు.