మరో యాదాద్రిగా కాళేశ్వరం

మరో యాదాద్రిగా కాళేశ్వరం

యాదగిరిగుట్ట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు కాళేశ్వరం పుణ్యక్షేత్రం విస్తరణపై దృష్టిసారించారు. గోదావరినది తీరంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అధ్బుతమైన పుణ్య క్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు వెంటనే రూ. 100 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణకు ప్రాణధార అయిన కాళేశ్వరం సాగు నీటి ప్రాజెక్ట్ పూర్తవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని, కాళేశ్వరం ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా కుటుంబ సమేతంగా, ఉన్నతాధికారులతో కలిసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని, పార్వతి మాతని దర్శించుకున్నారు కేసీఆర్ దంపతులు. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే ఆలయ అర్చకులతో కాసేపు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యత దృష్ట్యా ఇకనుండి ఆలయానికి, ఈ ప్రాంతానికి ప్రజలు లక్షల సంఖ్యలో తరలి వస్తారని.. దానికి అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 600 ఎకరాల స్థలాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ కి సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్ స్థాలలను అక్వైర్ చెయాలని అధికారులను ఆదేశించారు.

ఇక ఆలయ పరిసరాల్లో కళ్యాణ మండపంతో పాటు పెద్ద స్వాములు ఎవరైనా వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పడానికి వీలుగా ఆలయ నిర్మాణాన్ని విస్తరించాల్సి ఉంటుందన్నారు సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తవుతున్న సందర్భంలో ఒక మహోత్తరమైన యాగాన్ని నిర్వహించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. యజ్ఞ యాగాదులకు గోదావరి  తీరంలోని ఆలయ ప్రాంతం అణువుగా ఉంటుందని, ఆలయ పుణర్ నిర్మాణానికి శృంగేరి పీఠాధిపతి భారతి తీర్థ స్వామిని ఆహ్వానించినట్లు సీఎం వెల్లడించారు. కాళేశ్వరం బ్యారేజీలు అన్ని పూర్తయిన తర్వాత గోదావరి జలాలు ధర్మపురి లక్ష్మీనరసిహ్మ స్వామి పాదాలకు తాకే వరకు సుమారు 170 కిలోమీటర్లు నిలిచి ఉంటాయని తెలిపారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దయవల్ల ఈ ప్రాజెక్ట్ ద్వారా 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సమృద్ధిగా సాగు నీరు అందివ్వనున్నట్లు సీఎం వివరించారు. మరోవైపు అర్చకుల కోసం క్వార్టర్స్ నిర్మిస్తామని , వేద పాఠశాల, కళాశాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. గోదావరి పుష్కర ఘాట్స్ దగ్గర జాలిలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం