రేయింబవళ్లు పనిచేసి టార్గెట్ పూర్తిచేయాలి..

రేయింబవళ్లు పనిచేసి టార్గెట్ పూర్తిచేయాలి..

సిబ్బందిని ఎక్కువ మందిని పెట్టుకుని రేయింబవళ్లు పనిచేసి  లక్ష్యం సాధించాలని వర్క్ ఏజెన్సీలకు సూచించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తున్న సీఎం.. ఈ సందర్భంగా అధికారులకు, వర్క్ ఏజెన్సీలకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు కోటీ ఆశలతో కాళేశ్వరం నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల తరబడి అనుభవించిన సాగునీటి కష్టాలకు తెరపడుతుందని నమ్మకంతో ఉన్నారు.  రైతులకు సాగునీరందించడమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది.. కోటికి పైగా ఎకరాలకు సాగునీరందించేందుకు పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ ఎత్తపోతల పథకాలను నిర్మిస్తున్నది. వీటిలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. దాదాపు 80శాతం జిల్లాలకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరందించే బృహత్తర ప్రాజెక్టు ఇది. ఒక్కసారి ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. అందుకే ప్రభుత్వం ఎక్కడా నిధుల కొరత రాకుండా, భూసేకరణ సమస్య లేకుండా, విధాన నిర్ణయాల్లో జాప్యం జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు సీఎం కేసీఆర్.. దాని ఫలితంగానే ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది.  కాళేశ్వరం లాంటి అతి పెద్ద ప్రాజెక్టు నిర్మాణానికి 15-20 ఏళ్లు పడుతుంది. కానీ,  తెలంగాణ ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్ల అతి తక్కువ సమయంలోనే ప్రధానమైన బ్యారేజీలు పంపుహౌజ్ లు నిర్మించి గోదావరి నీటిని ఎత్తి పంట పొలాలకు తరలించనుందన్నారు.  ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతం.  వచ్చే నెల నుండే నీటి పంపింగ్ ప్రారంభించాల్సి ఉన్నందున అధికారులు, ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలి. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఉందో గ్రహించి అధికారులు, వర్క్ ఏజెన్సీలు కూడా ప్రాణం పెట్టి పనిచేయాలి. చివరి దశలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.