రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కంటి పరీక్షలు-కేసీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కంటి పరీక్షలు-కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించడానకి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం కావాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగాలని సూచించారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న కంటి పరీక్షల ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్... మొదట ఎన్ని కంటి పరీక్ష శిబిరాలు నిర్వహించాలో నిర్ధారించాలని... ఒక వైద్య బృందం ఒక రోజులో ఎంత మందికి కంటి పరీక్షలు నిర్వహించ గలదో తేల్చాలని సూచించారు. జనాభా ప్రతిపదికన ప్రతీ గ్రామానికి ఎన్ని వైద్య బృందాలు అవసరమవుతాయో లెక్క గట్టి అన్ని బృందాలను పంపించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్... ఒకే రోజులో గ్రామంలోని అందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని... గ్రామాల వారీగా కంటి పరీక్షలు నిర్వహిస్తూ పోవాలని... వైద్య బృందానికి వారానికి ఐదు రోజులు మాత్రమే పని కల్పించి శని, ఆదివారాలు సెలవు ఇవ్వాలని సూచించారు. వైద్య బృందం గ్రామాల్లో పర్యటించే సందర్భంలో అవసరమయ్యే రవాణా, భోజన, బస ఏర్పాట్లన్ని ప్రభుత్వం తరఫునే చేయాలన్న కేసీఆర్... కంటి పరీక్షలకు అవసరమైన పరికరాలను ముందే సమకూర్చుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 900 వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయని... రాష్ట్రంలోని కంటి వైద్యులనే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల వైద్యుల సేవలను కూడా ఉపయోగించుకోవాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి.