కేసీఆర్ సంచలన నిర్ణయం: టీఆర్ఎస్‌ ఓడిపోతే...

కేసీఆర్ సంచలన నిర్ణయం: టీఆర్ఎస్‌ ఓడిపోతే...

తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబిదళపతి కె.చంద్రశేఖర్‌రావు సంచలన నిర్ణయం తీసుకున్నారా? అంటే ఆ స్టేట్‌మెంట్ చూస్తే అది అనిపిస్తోంది... తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ... విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోన్న కేసీఆర్... ఖానాపూర్‌ బహిరంగసభలో సంచలన ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే తనకేమీ నష్టంలేదన్న ఆయన... ఇంట్లో పడుకుని రెస్ట్ తీసుకుంటానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆగమాగం కావోద్దు, ఎన్నికలు వస్తాయి, పోతాయి... ప్రజలు గెలవాలి... నాయకులు, పార్టీలు కాదన్నారు. ఏఊరికాఊరికి కాంగ్రెస్ ఉంది... దాని వెంట రెండు మూడు చిల్లర పార్టీలు కూడా ఉన్నాయి... పార్టీల గత చరిత్ర ఏంది.. నోట్ల కట్టలు దించాలనే దుర్మార్గమైన పద్ధతి తెచ్చారు అని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ 58 ఏళ్ల పాలన ఏమైంది.. నాలుగేళ్ల పసిగుడ్డు ఏంచేసింది మీకు తెలుసే అన్నారు.

కండ్ల ముందు అంత కనబడుతుంది... నేను రైతునే.. నామోటార్లు కూడా కాలిపోయాయి... ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయాయి... పెద్దపెద్ద మాటలు మాట్లాడిన వాళ్లు ఏపీలో కూడా 24 గంటల కరెంట్ ఇవ్వలేదు... కానీ, మేం తెలంగాణ ఇచ్చామని... దేశంలోనే 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక పార్టీ టీఆర్ఎస్సే అన్నారు. రూ. 12 వేల కోట్లు ఖర్చు చేసి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చాం... కాంగ్రెస్ పార్టీ తప్పిపోయి అధికారంలోకి వస్తే కరెంట్ మళ్లీ కిందమీద అవుతుందన్నారు. వాళ్లకు తెలివిలేదు... రాష్ట్రం నేను తెచ్చిన.. ఏరుబడ్డ సంసారం ఇప్పుడే గాడిలో పడుతుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రూ. 2 లక్షల రుణమాఫీ వట్టిమాట అని కొట్టిపారేసిన కేసీఆర్... ఆదాయం మీద అవగాహ లేక అప్పుడు కళ్యాణ లక్ష్మి కి తక్కువ ఇచ్చాం ఇప్పుడు పెంచాం... ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులకు న్యాయం చేస్తామన్నారు.