ఇదంతా కేసీఆర్‌ కొత్త డ్రామా

ఇదంతా కేసీఆర్‌ కొత్త డ్రామా

ఓటుకు నోటు కేసు అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... మళ్లీ కొత్త కొత్త ఆటలు ఆడుతున్నారంటూ ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో ఓటుకు నోటు కేసు పురోగతిని కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించిన వీహెచ్... టీఆర్ఎస్ సర్కార్‌పై ప్రజల్లో మార్పు కనిపిస్తోందని... ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నందున ఓటుకు నోటు కేసు, అవినీతి కేసుల బయటకు తెస్తున్నారని ఆరోపించారు. అవినీతిని బయటకు తెస్తే మంచిదే... మీ మంత్రులు, కుటుంబ సభ్యుల అవినీతిని కూడా బయటకు తీయాలి... కానీ, ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం సరికాదన్నారు వీహెచ్. 

రైతులకు రూ.4 వేలు కాదు... రూ.40 వేలు ఇచ్చినా తక్కువే నని... ఎన్నికల కోసమే రూ.4 వేలు ఇస్తున్నారని విమర్శించిన వీహెచ్... రైతు బంధు అంటే.. రైతులకు సంకెళ్లు వేయటమేనా? అని ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చుపెడుతున్నారంటూ మండిపడ్డారు. ఇక రేవంత్ రెడ్డిపై స్పందించిన వీహెచ్... రేవంత్ కేసు విషయంపై పీసీసీ చీఫ్ ని అడగండి... ఆయనే సరైన సమాధానం చెబుతారు... ఆయన్ని తీసుకొచ్చింది ఆయనే... మంచి చెడు ఆయనకే తెలుసని... ఇవన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉండిఉంటారన్నారు వీహెచ్.