5 గంటల తర్వాత భారీగా ఓటింగ్‌పై ఈసీకి ఫిర్యాదు..

5 గంటల తర్వాత భారీగా ఓటింగ్‌పై ఈసీకి ఫిర్యాదు..

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, రేణుకా చౌదరి, నిరంజన్.. లోక్‌సభ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత భారీఎత్తున ఓటింగ్ నమోదు కావడంపై ఫిర్యాదు చేశారు. నిజామాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, హైదరాబాద్‌ పార్లమెంట్ స్థానాల పరిధిలో సాయంత్రం 5 గంటల తర్వాత లక్షల ఓట్లు పోల్ కావడంపై అనుమానాలను వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల తర్వాత 5.26 శాతం ఓట్లు నమోదయ్యాయని ఈ సందర్భగా తెలిపారు మర్రి శశిధర్‌రెడ్డి... నిజామాబాద్‌లో 2,19,416 ఓట్లు, సికింద్రాబాద్‌లో 1,38,951, ఖమ్మంలో 1,10,153 ఓట్లు సాయంత్రం 5 గంటల తర్వాత పోల్ అయ్యాయని.. చేవెళ్లలో విచిత్రంగా మైనస్ 5 శాతం ఓట్లు నమోదయ్యాయని.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని కోరారు. సాయంత్రం 5 గంటల తర్వాత క్యూలో ఉన్న ఎంతమందికి “కాల్ చిట్టి” లు ఇచ్చారనేది రికార్డులు బయట పెట్టాలని ఈసీని కోరినట్టు తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం... పరిశీలిస్తామని హామీ ఇచ్చిందన్నారు మర్రి శశిధర్ రెడ్డి.