కేసీఆర్ మీద యుద్ధం చేస్తాం: భట్టి

కేసీఆర్ మీద యుద్ధం చేస్తాం: భట్టి

తెలంగాణ సీఎం కేసీఆర్ మీద యుద్ధం చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ రోజు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు కలిసి ఆడే వింతనాటకం జుగుస్తాకరంగా, నీచంగా ఉందన్నారు. ఇద్దరు స్వతంత్ర రాజుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించం ఎప్పుడో మానేశారని విమర్శించారు. ఒకపార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకోవటం.. చేరుతున్నాం అని చెప్పటం హేయంగా కనిపిస్తుందని మండిపడ్డారు. బరితెగించి సీఎం వ్యవహరిస్తున్నారు, ప్రజాస్వామ్య వాదులు చూస్తూ ఊరుకుంటే ప్రమాదం అని భట్టి విక్రమార్క అన్నారు.

ప్రతిపక్షం ఉండకూడదని కేసీఆర్ చూస్తున్నారు. ప్రతిపక్షం ఉంటే ఇరిగేషన్, మిషన్ భగీరథ అవినీతి బయటపడుతుందని కేసీఆర్ భయం. భారత ప్రభుత్వం తన మీద ఆధారపడి ఉండేలా కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మంది ఎమ్మెల్యేలను తీసుకున్నా.. అణచి వేయలనుకున్నా ప్రశ్నిచటం మాత్రం  మానుకోము.. కేసీఆర్ మీద యుద్ధం చేస్తామన్నారు. నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన కాంగ్రెస్ లేకుండా పోతుందనుకోవటం పొరపాటు. జేబు దొంగలా ఉన్నప్పుడే తల్లితండ్రులు కట్టడి చేస్తే బందిపోటు అయ్యేవాడు కాదని ఎద్దేవా చేసారు. 2014లోనే కట్టడి చేయలేదని ఇప్పుడు మరింత పెరిగారని భట్టి పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన గవర్నర్ చూస్తూ ఊరుకోవటం సరికాదు. వీరప్పమొయిలీ ఆధ్వర్యంలో ఈ నెల 18న గవర్నర్ ని కలుస్తాం. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ తో చర్చ చేస్తామన్నారు. రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, అవసరమైతే రాష్ట్రపతి పాలన పెట్టాలని అయన డిమాండ్ చేశారు.