గట్టు ఎత్తిపోతలకు బీజం వేసింది నేనే...

గట్టు ఎత్తిపోతలకు బీజం వేసింది నేనే...

గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ... గట్టు ఎత్తిపోతల పథకానికి బీజం వేసింది తానేనన్న ఆమె... సీఎం కేసీఆర్ ఏం చేయకపోయినా... అంతా మేమే చేశాంఅని చెప్పుకుంటున్నారని... ఎదుటివాడు చేసిన పని చేశాడు అని చెప్పటానికి ఎందుకు అంత మొహమాటమని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టులకు ప్రాణం పోసింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేసిన డీకే అరుణ... పాలమూరు ఎంపీగా ఐదేళ్లు కేసీఆర్ ఏం ఉద్దరించారని మండిపడ్డారు. మళ్లీ మళ్లీ నోరెత్తితే మర్యాదగా ఉండదంటూ హెచ్చరించిన ఆమె... అబద్ధాలు సహించేదిలేదన్నారు.

ఉమ్మడి పాలమూరులో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏమీలేదన్నారు డీకే అరుణ... కల్వకుర్తి లిఫ్ట్ ఆగిపోవటానికి బాధ్యుడు, ఆ పాపం జూపల్లి కృష్ణారావుదేనని మండిపడ్డ ఆమె... పాలమూరుని మోసం చేస్తున్నందుకు క్షమాపణ చెప్పాలి... కేసీఆర్, మంత్రి హరీష్‌రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పొరపాటున టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించిన డీకే అరుణ... పదే పదే మోసం చేస్తామంటే ఎవరూ నమ్మరన్నారు. గద్వాలకు 5 వేల ఇళ్లు ఇస్తామని చెప్పారు... మరి ఏవి అని ప్రశ్నించారు. కలిసి పనిచేద్దాం అన్నారు... ఎప్పుడైనా కలుపుకొని పోయారా..? ఎమ్మెల్యే లతో ఎప్పుడైనా మాట్లాడారా..? థర్మల్ ప్రాజెక్ట్.. సోలార్ ప్రాజెక్ట్ ఏమైంది..? ఎన్నికలు వస్తున్నాయని గట్టు ప్రాజెక్ట్ గుర్తుకు వచ్చిందా? డీపీఆర్ సిద్ధం చేయటానికి నాలుగేళ్లు పట్టిందా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.