ఆప్మెల్‌పై కేంద్రానికి ఫిర్యాదు లేఖ

ఆప్మెల్‌పై కేంద్రానికి ఫిర్యాదు లేఖ

తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సింగరేణి అనుబంధ సంస్థ ఆప్మెల్‌ ను చేజిక్కించుకోవాలనే ఏపీ ఎత్తుగడను తిప్పికొట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. విభజన చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తూ.. అత్యంత విలువైన ఆప్మెల్‌ను సొంతం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నించడం దారుణ విషయం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి సింగరేణిలో వాటా ఉండటం వలెనే.. ఆప్మెల్‌పై ఈ రెండింటికే పూర్తి హక్కు ఉంటుందని తెలిపారు. ఏపీకి లాభం చేకూర్చేలా షీలాభిడే కమిటీ నివేదిక ఇవ్వడంను సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై కేంద్రానికి లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని ఆదేశించారు.

షీలాభిడే కమిటీ ఇచ్చిన నివేదికపై సోమవారం తెలంగాణ సీఎం కేసీఆర్.. సీఎస్‌, సింగరేణి సీఎండీలతో ఫోన్‌లో మాట్లాడారు. షీలాభిడే కమిటీ ఏపీకి అనుకూలంగా ఉంటూ.. తొమ్మిదో షెడ్యూలు సంస్థల విభజనలో తెలంగాణకు అన్యాయం చేసిందని వారికి తెలిపారని సమాచారం. ఏపీ ప్రభుత్వం కూడా విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహరించడం దారుణం అని అన్నారు. అన్ని విధాలుగా చూస్తే.. ఆప్మెల్‌ తెలంగాణకే దక్కుతుందన్నారు. షీలాభిడే కమిటీ నిర్ణయాలను సమీక్షించాలని.. ఈ విషయమై కేంద్రానికి ఫిర్యాదు చేయాలన్నారు. వెంటనే దిల్లీకి వెళ్లి రెండు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని ఆయన సూచించారు. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సోమవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గాబాకు లేఖ రాశారు. షెడ్యూలు-9లో ఉన్న సంస్థల  విషయంలో వివాదాలు, సందేహాలు తలెత్తుతే.. కేంద్రం జోక్యం చేసుకొని పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారన్నారు.