ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్..! దసరా సెలవులు పొడిగింపు..!?

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్..! దసరా సెలవులు పొడిగింపు..!?

ముందే సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చర్చలు విఫలం కావడంతో దసరా పండుగ ముందు సమ్మెకు దిగారు ఆర్టీసీ కార్మికులు.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా అవి ప్రజల అవసరాలను తీర్చలేకపోయాయి.. అష్టకష్టాలు పడి ఎలాగోలా దసరా పండగకు సొంత ఊళ్లకు చేరుకున్నారు. అయితే.. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరగకపోడంతో.. ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యాసంస్థలకు దసరా సెలవులు పొడిగించే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. 

సెప్టెంబర్ 28వ తేదీ నుంచి దసరా హాలీడేస్ ఇచ్చింది ప్రభుత్వం.. ఆదివారాలు, రెండో శనివారం కలిసిరావడంతో ఈ సారి ఎప్పుడూ లేని విధంగా 16 రోజులు హాలీడేస్ వచ్చాయి.. అయితే.. ఒక పక్క ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటం, మరోపక్క పండుగకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యే వారికి బస్సుల కొరత ఉండటంతో ప్రభుత్వం సెలవులను పొడిగించే యోచన చేస్తున్నట్లు సమాచారం. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించి ఆ బస్సులను కూడా ప్రజా రవాణాకు ఉపయోగించాలన్న ఆలోచన ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.