దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌.. సిట్ దృష్టి సారించింది వీటిపైనేనా...?

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌.. సిట్ దృష్టి సారించింది వీటిపైనేనా...?

వెటర్నరీ డాక్టర్ దిశ కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తే... ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆ నలుగురి ఎన్‌కౌంటర్ సంచలనంగా మారింది. దిశను నిందితులు దహనం చేసిన ప్రాంతంలోనే వారిని ఎన్‌కౌంటర్‌లో కాల్చేశారు తెలంగాణ పోలీసులు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తే.. మరికొందరు తప్పుబట్టారు.. మిగతా రేప్ కేసుల్లో ఉన్న నిందితుల పరిస్థితి ఏంటి? అని ప్రశించారు. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. రాచకొండ పోలీస్ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది సర్కార్. ఈ టీమ్‌లో వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రాచకొండ ఎస్‌వోటీ డీసీపీ సురేందర్‌, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌, సంగారెడ్డి డీసీఆర్‌బీ సీఐ వేణుగోపాల్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై పూర్తి విచారణ జరపాలని సిట్‌ను ఆదేశించింది సర్కార్. ఇక, ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల వివరాలను సిట్‌ సేకరించనుంది. అసలు ఘటనా స్థలంలో ఏం జరిగింది..? ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే తదితర వివరాలపై దృష్టి సారించనుంది సిట్.