హస్తినకు గవర్నర్.. మోడీ, అమిత్‌షా దృష్టికి ఆర్టీసీ సమ్మె..!

హస్తినకు గవర్నర్.. మోడీ, అమిత్‌షా దృష్టికి ఆర్టీసీ సమ్మె..!

తెలంగాణ గవర్నర్ తమిళిసై హస్తిన పర్యటనకు వెళ్తున్నారు.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో.. సాయంత్రం 4 గంటలకు కేంద్రహోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో తమిళిసై భేటీ కానున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరుకోగా.. రోజురోజుకూ సమ్మె ఉధృతమవుతోంది.. అయితే, ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయాన్ని మోడీ, షా దృష్టికి గవర్నర్ తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. 

ఇక, తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన బీజేపీ.. ఇక్కడ జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తోంది. దీనిలో భాగంగానే ఇవాళ ఉదయం తెలంగాణ రాజ్‌భవన్‌కు ఫోన్ కాల్ వచ్చినట్టు తెలుస్తోంది.. దీంతో ఢిల్లీకి గవర్నర్ తమిళిసై బయల్దేరారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ఢిల్లీ చేరుకోనున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయి.. ఉద్యోగ, కార్మిక సంఘాలు.. ఇప్పుడు.. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో కిందిస్థాయిలో పరిస్థితి ఎలాఉంది అనే దానిపై ప్రధానితో పాటు బీజేపీ చీఫ్ ఆరా తీసే అవకాశం ఉందని సమాచారం.