గవర్నర్ తండ్రి కాంగ్రెస్ నుండి అసెంబ్లీకి పోటీ

గవర్నర్ తండ్రి కాంగ్రెస్ నుండి అసెంబ్లీకి పోటీ

కొత్తగా నియమితులైన తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ బీజేపీ పార్టీలో కీలక బాద్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. ఆమె ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ గా కూడా పని చేశారు. అయితే ఆమె తండ్రి కుమారి అనంతన్‌ మాత్రం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. 86 ఏళ్ళ అనంతన్ తమిళనాడులో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తిరునల్‌వేలి జిల్లా నంగునేరి స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అనంతన్‌ గతంలో టీఎన్‌పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే పొత్తులో భాగంగా డీఎంకే ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ కు కేటాయించింది. అనంతన్‌ సోదరుడు, నంగునేరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వసంత కుమార్‌ 2019 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికవడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరుగనుంది. ఈయన అభ్యర్థిత్వం ఖరారు కానప్పటికీ టీఎన్‌పీసీసీ అధ్యక్షుడు అళగిరి అనంతన్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నంగునేరి, విక్రవాండి స్థానాలకు అక్టోబర్‌ 21న ఉపఎన్నిక జరగనుంది.