ఆర్టీసీ సమ్మెపై విచారణ వాయిదా

ఆర్టీసీ సమ్మెపై విచారణ వాయిదా

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. వాదనలు వాడివేడిగా కొనసాగాయి. ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యాఖ్యల్ని చేయడం మాత్రమే కాదు, తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. రాత్రికిరాత్రే సమస్యలన్నీ పరిష్కారం కావని పేర్కొంది. అయితే ఇందుకు ప్రభుత్వం కూడా తన వాదనలను వినిపించింది. ఆర్టిసీ సమ్మె పరిష్కారానికి విలీన అంశం ప్రధాన ఆటంకంగా ఉందని మిగతా అంశాలపై భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది.

ప్రస్తుతానికి ఆర్టిసీ విలీనం డిమాండ్లను పక్కన పెట్టకపోతే ప్రతిష్టంభన ఇలాగే కొనసాగుతుందని ఇరువర్గాల మూలంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక రీయింబర్స్‌మెంట్‌, జిహెచ్‌ఎంసి బకాయిలు రూ.4,967 కోట్లు ఉన్నాయంటూ కార్మిక సంఘాలు చెబుతున్నది నిజమేనా అని కోర్టు ఆర్టిసీని ప్రశ్నించింది. దీనిపై రేపు పరిశీలించి చెప్పాలని ఆదేశించింది. అనంతరం కోర్టు తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం ఎల్లుండి వరకు గడువు ఇవ్వాలని కోరగా హైకోర్టు కుదరదని తేల్చి తెలిపింది.