ఇంటర్‌ ఫలితాలపై హైకోర్టు సీరియస్..

ఇంటర్‌ ఫలితాలపై హైకోర్టు సీరియస్..

తెలంగాణ ఇంటర్ ఫలితాల వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని ఘాటుగా స్పందించింది. ఫెయిల్ అయిన 3 లక్షల మంది విద్యార్థుల రీ-వాల్యుయేషన్‌పై నిర్ణయాన్ని తెలపాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది కోర్టు.. ఇంటర్ ఫలితాలలో వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ వేశామని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు అడిషనల్ ఏజీ రామచందర్‌రావు. అయితే, ఈ ఏడాది 9.70 లక్షల మంది విద్యార్థుల పరీక్ష రాశారని.. ఇప్పటి వరకు 16 మంది విద్యార్థులు చనిపోయారని.. అయినా, ఇప్పటి వరకు ఇంటర్ బోర్డ్ స్పందించడం లేదన్న పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇంటర్ ఫలితాలపై జరిగిన అవకతవకలపై జ్యూడిషియల్ ఎంక్విరీ జరిపించాలని కోర్టును కోరారు. 50 వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి వాదించారు. 

అయితే, జ్యుడీషియల్ ఎంక్విరీ వేయడం పరిష్కారం కాదని అభిప్రాయపడింది హైకోర్టు.. విద్యార్థులకు న్యాయం జరగాలి, బోర్డులో ఉన్న లోపల్ని ఎత్తి చూపండి అని సూచించింది. మరోవైపు, తప్పుల్ని సరిచేస్తాం, వారంలోపు సమస్య పరిష్కారం చేస్తామని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది.. విద్యార్థుల సమస్యలకి పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. ఇక రీ-వాల్యుయేషన్, రీ-కౌంటింగ్‌కు ఈ ఏడాది 9 వేల దరఖాస్తులు వచ్చాయని.. ప్రతీఏడాది ఇవి 25 వేల వరకు వస్తాయని తెలిపారు. పరీక్షలు రాసిన విద్యార్థుల్లో ప్రతీ ఏడాది 30 శాతానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని వివరణ ఇచ్చారు. అయితే, 9.70 లక్షల మందికి పేపర్ వాల్యుయేషన్‌కి 2 నెలల సమయం పడితే.. మరి 3 లక్షల మందికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నించింది హైకోర్టు.. దీనికి రెండు నెలల సమయం పడుతుందని బదులిచ్చింది ప్రభుత్వం. ఈ సందర్భంగా 3 లక్షల మందికి 10 రోజులు సమయం సరిపోతుందని హైకోర్టు అభిప్రాయపడింది. వాళ్లంతా భవిష్యత్ ఉన్నవాళ్లు.. డాక్టర్లు , ఇంజినీర్లు కావాల్సినవాళ్లు అంటూ నేరుగా వాదనలు వినిపించారు ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్.. అయితే, గతం, భవిష్యత్‌ కాదు.. ఇప్పుడు పరిష్కారం ఏంటి? చెప్పండి అని హైకోర్టు ప్రశ్నంచింది. దీనిపై సోమవారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన 3 లక్షల మంది విద్యార్థుల పేపర్లు రీ వాల్యుయేషన్ పై ఇంటర్ బోర్డ్ నిర్ణయం తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను సోమవారం వరకు వాయిదా వేసింది హైకోర్టు.