వేధింపుల కేసులో ఇంటెలిజెన్స్ సూపరింటెండెంట్ అరెస్ట్..

వేధింపుల కేసులో ఇంటెలిజెన్స్ సూపరింటెండెంట్ అరెస్ట్..

మీరుపేట మున్సిపల్ కమిషనర్ వసంతను వేధించిన కేసులో తెలంగాణ ఇంటెలిజెన్స్ సూపరింటెండెంట్ అన్వర్ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పోలీసులు. తాను ఏసీబీ అధికారినంటూ మెసేజ్‌లు, ఫోన్ ద్వారా వసంతను వేధించినట్టు అన్వర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు వసంత.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అన్వర్ హుస్సేన్‌కోసం గాలించి చివరకు అరెస్ట్ చేశారు. అయితే, తనకు తెలిసే తప్పు చేశా... నన్ను క్షమించాలంటూ పోలీసులను వేడుకున్నాడు అన్వర్. కాగా, ప్రస్తుతం మీర్‌పేట మునిసిపల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్‌.వసంత గతంలో బడంగ్‌పేట కమిషనర్‌గా పని చేశారు. అప్పట్లో బాలాపూర్‌ మండలం, మల్లాపూర్‌ సమీపంలోని డ్రీమ్‌ మెగాసిటీ కాలనీకి చెందిన అన్వర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. వాస్తవానికి అతడు పోలీసు విభాగంలోని ఇంటెలిజెన్స్‌ వింగ్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తుండగా, ఏసీబీ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. తనకు కావాల్సిన పనులు కూడా కొన్ని చేయించుకున్నాడు. అనంతరం ఆమె మీర్‌పేట కమిషనర్‌గా బదిలీ అయ్యారు. కొంత కాలంగా అన్వర్‌ ఆమెకు నిత్యం ఫోన్‌ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతూ అభ్యంతరకరమైన మెసేజ్‌లు పంపిస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో.. అన్వర్ ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చంది.