దిశ నిందితుల ఎన్‌కౌంటర్.. మంత్రి ఈటల సంచలన కామెంట్స్...

దిశ నిందితుల ఎన్‌కౌంటర్.. మంత్రి ఈటల సంచలన కామెంట్స్...

దిశపై అత్యాచారం, హత్య... ఆ తర్వాత నిందితుల ఎన్‌కౌంటర్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది... నిందితుల ఎన్‌కౌంటర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో... టీఆర్ఎస్‌లో కీలకనేత, మంత్రి ఈటల రాజేందర్ చేసిన కామెంట్లు చర్చగా మారాయి... అత్యాచారాల లాంటి నేరాలకు ఉరి శిక్ష వేయడం, కాల్చి చంపడం అనే శిక్షలు శాశ్వత పరిష్కారం కావని అభిప్రాయపడ్డ ఆయన.. దిశ లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే.. మొట్టమొదట సమాజంలో మార్పు రావాలన్నారు. ఇటీవల జరుగుతున్న దారుణాలతో చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని.. వారు బయటకు వెళ్లి క్షేమంగా తిరిగొస్తారా? లేదా? అనే భయపడుతున్నారని చెప్పారు. కంచె చేను మేసినట్లుగా తన పిల్లల పైనే తండ్రి క్రూర మృగంగా ప్రవర్తిస్తున్నారని.. ఆడబిడ్డలకు సొంత ఇంట్లోనే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి ఈటల రాజేందర్.

ఇదే సందర్భంలో టెక్నాలజీ కూడా ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి ఈటల... సెల్ ఫోన్లు, టీవీలు, టెక్నాలజీ మనిషి బాగు పడటం కోసం, సుఖమయ జీవనం కోసం ఉపయోగపడాలి.. కానీ, ప్రస్తుతం అవే మానవ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. మనిషి సృష్టించిన టెక్నాలజీయే అతడిని నాశనం చేస్తోంది. ఈ విధ్వంసాన్ని మనిషి ఊహించలేకపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఓవైపు తెలంగాణ పోలీసులు, సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురుస్తున్న సమయంలో... మంత్రి ఈటల చేసిన ఈ కామెంట్లు చర్చగా మారాయి.