ఏపీకి ప్రత్యేక హోదాతో మాకు ఇబ్బంది లేదు

ఏపీకి ప్రత్యేక హోదాతో మాకు ఇబ్బంది లేదు

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి. తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఢిల్లీలో డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ను కలిసిన ఆయన... తెలంగాణ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.  రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. కానీ, విభజన చట్టం అమలు చేసే క్రమంలో తెలంగాణ కు అన్యాయం జరగకుండా చూడాలని పేర్కొన్నారు.  కేసిఆర్ ఉద్యమాన్ని నడిపించిన తీరును స్పూర్తిగా తీసుకొని ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతంగా ప్రజల్లోకి  తీసుకెళ్లాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు లబ్ధి కోసం చేస్తున్నాయని తెలిపారు. 

తెలంగాణ విద్యా సంస్థల ఏర్పాటుకు ఎన్నో విజ్ఞప్తులు చేసినా ఇంతవరకు ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదని స్పష్టంచేశారు.  విభజన చట్టం ప్రకారం గిరిజన విశ్వవిద్యాలయం తక్షణమే ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు కడియం తెలిపారు. భూమి ఇచ్చేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉన్నా కేంద్రం స్పందించడం లేదని కేంద్ర మంత్రికి గుర్తు చేసినట్లు స్పష్టం చేశారు.  హైదరాబాద్ కు ఐఐఎం ఇవ్వాలని కోరినా ఇంతవరకు ఏమి చెప్పలేదని తెలిపారు. నూతన జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు కావాలని అడిగినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ లో ఐఐఐటీ ఏర్పాటు చర్యలు తీసుకోవాలని కోరినట్లు మంత్రి తెలిపారు.  పేద విద్యార్థుల చదువు కోసం 12వ తరగతి వరకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని కడియం శ్రీహరి పేర్కొన్నారు.