టీఆర్ఎస్ కు 100 సీట్లు ఖాయం

టీఆర్ఎస్ కు 100 సీట్లు ఖాయం

భవిష్యత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లు గెలుస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దేశం మొత్తం అబ్బురపడేలా కేసీఆర్ పాలనా సాగిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ జలవిహార్ లో నగర టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన... ఏపీ సీఎం ప్రతిసారి గిల్లికజ్జాలు పెట్టుకుంటుంటే.. కేసీఆర్ మాత్రం పరిణితితో అభివృద్ధిపై మాట్లాడేవారని అవిశ్వస తీర్మానం సందర్భంగా స్వయంగా ప్రధాని మోడీ కూడా చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధిని మేళవించి పాలనా సాగిస్తున్నారని తెలిపారు. నాలుగున్నరేళ్ల పాలనా పురోగతిని రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు కొంగర కలాన్ లో ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చిత్ర, విచిత్రంగా విమర్శలు చేస్తున్నాయని తెలిపారు. కుటుంబ పాలనపై రాహులు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలని ఆగం చేసేందుకు కిందమీద పడుతున్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సమస్య లేదని చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోమ్ మంత్రి నాయిని, మంత్రులు తలసాని, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పొల్గొన్నారు. కొంగరకలాన్ లో జరిగే ప్రగతి నివేదన సభ జన సమీకరణపై చర్చించారు.