భారీ వర్షాలపై కేటీఆర్‌ సమీక్ష.. అధికారుల సెలవులు రద్దు..

భారీ వర్షాలపై కేటీఆర్‌ సమీక్ష.. అధికారుల సెలవులు రద్దు..

రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి... మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది... వర్షాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి కేటీఆర్.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పురపాలక పట్టణాల్లో ఉన్న పరిస్థితులపై ఆరా తీసిన ఆయన.. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న రెండు వారాలపాటు అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు కేటీఆర్. నిరంతరం క్షేత్రంలో ఉంటూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ పర్యవేక్షణ చేయాలని సూచించారు. 

కేవలం 10 రోజుల్లోనే 54 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని మంత్రి కేటీఆర్‌కు తెలిపారు అధికారులు. భారీ వర్షంలోనూ సాధ్యమైనన్ని ఎక్కువ సహాయక చర్యలు చేపడుతున్నామన్న కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, వర్షాలకు పాడైన రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి... వర్షాలు తగ్గగానే అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింతగా పెంచాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ, జలమండలి ఉన్నత అధికారులు పాల్గొన్నారు.